ఎన్నికలు వస్తే చాలు ఎక్కడి నుంచి తీస్తారో తెలియదు కానీ, రంగు రంగుల నోట్ల కట్టలు ప్రాణం వచ్చిన సీతాకోక చిలుకల్లా బయటకు వస్తాయి. ప్రస్తుతం తెలంగాణ (Telangana)లో ఇదే పరిస్థితి నెలకొంది. ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద మొత్తంలో మనీ పట్టు బడుతోంది. తాజాగా అక్రమంగా తరలిస్తున్న భారీ నగదును నార్త్ జోన్ (North Zone) టాస్క్ ఫోర్స్ (Task Force), గాంధీనగర్ (Gandhinagar) పోలీసులు (Police) సీజ్ చేశారు.
కవాడిగూడ ( Kavadiguda) ఎన్టీపీసీ బిల్డింగ్ (NTPC Building) వద్ద ఓ కారులో అక్రమంగా తరలిస్తున్న రూ. 2.9 కోట్ల హవాలా డబ్బును గుర్తించారు పోలీసులు. డబ్బు తరలిస్తున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొన్నారు. కారుతో పాటు బైకు సీజ్ చేశారు. కాగా కేసు నమోదు చేసిన పోలీసులు ఈ డబ్బు ఎక్కడిది? ఎవరిచ్చారు? అనే కోణంలో విచారణ చేపట్టారు.
మరోవైపు మాదాపూర్ లో రూ.32 లక్షల 9 వేలు.. గచ్చిబౌలి పోలీస్టేషన్ పరిధిలో రూ. 10 లక్షల 39 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వీటితో పాటు రెండు ద్విచక్ర వాహనాలు, ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇకపోతే తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలైనప్పటి నుంచి పోలీస్ శాఖ విస్తృత స్థాయిలో తనిఖీలు మొదలు పెట్టింది. డబ్బు, మద్యం తరలింపు పై బాగా ఫోకస్ పెట్టింది. హైదరాబాద్ తో సహా అన్ని జిల్లాల సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహన తనిఖీలు ముమ్మరం చేసింది..