రోజురోజుకు దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. భానుడి తాపానికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా పగటి ఉష్ణోగ్రతలు(Temperature) అధికంగా ఉండటంతో జనం బయటికి రావాలంటేనే జంకుతున్నారు. అయితే రానున్న ఐదు రోజుల పాటు ఎండ తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ కేంద్రం (IMD) పేర్కొంది.
మే, జూన్ నెలల్లో 10 నుంచి 20 రోజుల పాటు వేడి గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 6.4 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉన్నప్పుడు తీవ్రమైన వేడి తరంగాలు (Heatwave) ఏర్పడతాయని ఐఎండీ తెలిపింది. మంగళవారం తూర్పు మధ్యప్రదేశ్లో రాత్రి వేళలో ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది.
ఈ ప్రభావంతో మధ్యప్రదేశ్, గుజరాత్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, మధ్య మహారాష్ట్ర, విదర్భ, మరఠ్వాడా, బీహార్, జార్ఖండ్లలో ఎక్కువ వేడి తరంగాలు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. దీంతోపాటు రానున్న మూడు రోజుల్లో దేశ రాజధాని ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వెల్లడించింది.
ప్రధానంగా ఒడిశా, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వేడి ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది. గాలిలో అధిక తేమ కారణంగా తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, గోవా, కేరళతో పాటు కోస్తా ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్లలో ప్రజలు ఉక్కపోతతో ఇబ్బందులు ఎదుర్కొంటారని ఐఎండీ వెల్లడించింది.