హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీ (Hyderabad Traffic Diversion) తీవ్రమైన దృష్ట్యా సైబరాబాద్ పోలీసులు(Cyberabad police) కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరంలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సిటీలో అత్యంత రద్దీ ప్రాంతాలపై వారు ఫోకస్ పెట్టారు.
ముందుగా హైటెక్ సిటీ (Hi-tech city), ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో నేటి నుంచి ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు. ఈ మేరకు సిటీ వాసుల సౌకర్యార్థం ముందే సమాచారం అందించారు. ఇకపై హైటెక్ సిటీ మార్గంలో ప్రయాణించే వారు ఈ దారుల్లోనే ట్రావెల్ చేయాలని సూచించారు.
హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఐకియా రోటరీ వైపు వెళ్లే అన్ని మార్గాల్లో శుక్రవారం నుంచి ట్రాఫిక్ మళ్లింపులు అమల్లోకి రానున్నాయి.
1. బయోడైవర్సిటీ నుంచి హైటెక్ సిటీ, హైటెక్ సిటీ నుంచి బయోడైవర్సిటీ వెళ్లే వారు అండర్ పాస్ గుండా వెళ్లాలి.
2.బయోడైవర్సిటీ నుంచి దుర్గం చెరువు వైపు వెళ్లే వారి కోసం కుడివైపు దారి మళ్లించారు.
3.ఏఐజీ నుంచి బయోడైవర్సిటీ వెళ్లే వారికోసం యూటర్న్ ఏర్పాటు చేశారు.
ట్రాఫిక్ మళ్లింపులకు సంబంధించి సైబరాబాద్ పోలీసు విభాగం ప్రత్యేకమైన వీడియోను సైతం రూపొందించి విడుదల చేసింది. నగరంలో రోజురోజుకూ ట్రాఫిక్ క్రమంగా పెరుగుతున్న దృష్ట్యా ట్రాఫిక్ చిక్కులు రాకుండా ఉండేందుకు ఈ మేరకు చర్యలు చేపట్టినట్లు పోలీసులు అధికారులు వెల్లడించారు. రానున్న రోజుల్లో ట్రాఫిక్ చిక్కులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయనున్నట్లు పేర్కొన్నారు.