రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం, శాశ్వత మిత్రుత్వం అనేవి ఉండవని పొలిటికల్ విశ్లేషకులు అప్పుడప్పుడు గుర్తుచేస్తుంటారు. ఇదే విషయాన్ని ప్రస్తుత రాజకీయ పార్టీలు,రాజకీయ నేతలు కూడా బాగా ఫాలో అవుతున్నారు. ఈ ఒక్కటి తెలిస్తే చాలు రాజకీయాల్లో వారికి మనుగడ పెద్ద కష్టమేమీ కాదు. ఎందుకంటే ప్రస్తుతం కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఈ తరహా పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఇకపోతే, కేంద్రంలో అధికార బదిలీ జరిగితే అది కాంగ్రెస్(CONGRESS), బీజేపీ(BJP) మధ్యే ఉంటుంది. మిగతా ప్రాంతీయ పార్టీలన్నీ ఎన్డీయే లేదా ఒకప్పటి యూపీయే కూటమిలో చేరేవి.
జాతీయ స్థాయి రాజకీయాల్లో మాత్రం కాంగ్రెస్, బీజేపీ బద్దశత్రువులు. ఈ రెండు పార్టీలు కలిసి పనిచేయడం అసాధ్యమే కాదు కష్టం కూడా. అందుకే ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఒకదానిమీద మరొకటి దుమ్మెత్తి పోసుకుంటాయి. అయితే, తెలంగాణలో మాత్రం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటిగా కలిసి ముక్తకంఠంతో గత బీఆర్ఎస్ సర్కార్ చేసిన తప్పులను ఎత్తి చూపుతున్నారు. అందులోనూ కాస్త వేరియేషన్ ఉండొచ్చు. మొన్నటివరకు కాళేశ్వరంలో అంశంలో ఒక్కొక్కరు ఒక్కో స్ట్రాటజీతో ముందుకెళ్లారు.
కానీ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్(PHONE TAPPING) వ్యవహారంలో మాత్రం బీజేపీ, కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ(BRS PARTY)ని, మాజీ సీఎం కేసీఆర్(EX CM KCR)ను ప్రజల్లో దోషిగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నందున ఆ పార్టీని రాజకీయంగా బొంద పెట్టాలని బీజేపీ, కాంగ్రెస్ కంకణం కట్టుకున్నాయి. అందుకే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆ పార్టీల నేతల వేళ్లు బీఆర్ఎస్ పార్టీనే చూపిస్తున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల టైంలో కాంగ్రెస్, బీజేపీ నేతల ఫోన్లు ట్యాపింగ్ జరిగాయని పోలీసులు ఇప్పటికే తేల్చారు. ఈ కేసులో ఎస్ఐబీ సస్పెండెడ్ డీఎస్పీ ప్రణీత్ రావు అరెస్టుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తాజాగా దీనిపై సీఎం రేవంత్ , కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ యవ్వారం అంతా బీఆర్ఎస్ పార్టీ టాప్ లీడర్స్, మాజీ మంత్రుల ఆధ్వర్యంలో జరిగిందని వీరు ఆరోపించారు. ఇందులో కేసీఆర్ ఏ1 అని కిషన్ రెడ్డి, దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. వారి వద్ద అందుకు ఆధారాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. గత ఉపఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓటమికి, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కీలక నేతల ఓటమికి ఫోన్ ట్యాపింగ్ కారణమని రఘునందన్ రావు ఆరోపించారు.సీఎం రేవంత్, కాంగ్రెస్ నేతలు కూడా గులాబీ పార్టీని టార్గెట్ చేశారు. బీజేపీ, కాంగ్రెస్ ఈ ఒక్క విషయంలో ఒకే స్టాండ్ తీసుకుని గత బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులను ఎండగడుతున్నారని టాక్ వినిపిస్తోంది.