ఆంధ్రా- తెలంగాణ బోర్డర్‌ను ఆనుకుని ఉన్న నల్లమల ఫారెస్టు(Nallamala Forest)అర్థరాత్రి కార్చిచ్చు(Fire Accident) రగిలింది. ఉన్నట్టుండి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో ఫారెస్టు అధికారులు వెంటనే అలర్ట్ అయ్యారు. ఆ రాత్రి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో పాటు సుమారు రెండు గంటలు తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. లేదంటే ఆ కార్చిచ్చు దావాలనం చేసే భీభత్సాన్ని ఎవరూ ఊహించలేకపోయేవారని అధికారులు చెబుతున్నారు.
నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం నల్లమల అటవీ ప్రాంతంలో మన్ననూర్ వెస్ట్ బీట్ తాళ్లచెల్క, గుండం ఏరియాలో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలు అప్పటికే వేగంగా వ్యాప్తి చెందుతుండగా..అటవీ శాఖ సిబ్బందితో సహా అక్కడకు చేరుకున్నారు.
ఫైర్ సేఫ్టీ, బేసిక్ క్యాంప్ వాచర్లు, సిబ్బందితో ఎట్టకేలకు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్నిప్రమాదం గురించి జిల్లా అటవీ శాఖ అధికారి శనివారం అర్ధరాత్రి రోహిత్ రెడ్డికి సమాచారం ఇవ్వగా..వెంటనే అటవీ శాఖ అధికారులు అమ్రాబాద్, మన్ననూర్ అటవీ క్షేత్ర అధికారులు ఆదిత్య, ఈశ్వర్ మన్ననూర్ , బీట్ ఆఫీసర్స్ మధు, హన్మంతు, కార్తీక్ బేస్ క్యాంపు సిబ్బందితో ఘటనా స్థలికి చేరుకున్నారు. 2 గంటల పాటు తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
ఈ ఘటన మానవ తప్పిదం వల్ల జరిగిందా? లేక ప్రమాదవశాత్తు జరిగిందా? అనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. అడవుల్లో మంటలు వ్యాప్తి చెందితే మూగజీవాలు, సరిసృపాలు, కీటకాలు మొదలైన జీవులకు హాని కలుగుతుందన్నారు. అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉండే గ్రామస్తులు అడవిలో మంటలు పెట్టరాదని సూచించారు. ఎవరైనా అటవీ చట్టాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.