కరోనా (Corona) కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డునపడ్డాయి. తల్లిదండ్రుల్ని కోల్పోయి ఎందరో పిల్లలు అనాధలయ్యారు. వారి కోసం కేంద్ర ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలను తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లోని యోగి (Yogi) సర్కార్ వలస నిర్మాణ కార్మికుల కోసం మరో ఆలోచన చేసింది. అటల్ అవాసీయ విద్యాలయాలను ఏర్పాటు చేసింది. ప్రధాని మోడీ చేతులమీదుగా ఇవి ప్రారంభం అయ్యాయి.
కొన్ని సంవత్సరాల క్రితం వలస కార్మికుల సమస్యలను వింటూ, వారి పిల్లల చదువుల సమస్య గురించి తెలుసుకున్నారు సీఎం యోగి. విద్యకు దూరం అవుతున్న పిల్లల కోసం పూర్తిగా రెసిడెన్షియల్ సదుపాయంతో ఉచిత విద్యను అందించాలని నిర్ణయించారు. దీనికోసం ప్రత్యేక పాఠశాలల గురించి ఆలోచించారు. తల్లిదండ్రులకు పిల్లల చదువుల బాధ్యత తప్పించాలి అని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అటల్ అవాసీయ విద్యాలయాలకు శ్రీకారం చుట్టారు.
రాష్ట్రంలో ప్రతి డివిజన్ లో ఒక్కొక్కటి చొప్పున 18 పాఠశాలలను నిర్మిస్తున్నారు. ఒక్కో స్కూల్ ను 12-15 ఎకరాల్లో దాదాపు రూ.65 కోట్లతో రూపొందిస్తున్నారు. ఈ పథకం అనుకున్న వెంటనే అమలుకు ప్రణాళికలు రచించి, కోవిడ్, లాక్‌డౌన్లు ఉన్నప్పటికీ 16 పాఠశాలలు పూర్తి చేశారు. తాజాగా ప్రధాని మోడీ చేతుల మీదుగా ఇది ప్రారంభించబడ్డాయి. మరో 2 నిర్మాణంలో ఉన్నాయి. ఈ ఏడాది చివరి నాటికి ఇవి పూర్తవుతాయి.
కరోనా వల్ల అనాథలైన పిల్లలను కూడా ఈ స్కీమ్ లో చేర్చింది యోగి సర్కార్. వలస నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం దేశంలో ఇటువంటి ప్రతిపాదన చేసిన మొట్టమొదటి రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ నిలిచింది. ఇక, ఫేజ్-2లో ప్రతి జిల్లాకు ఒక అటల్ అవాసీయ విద్యాలయం ఏర్పాటు చేస్తామని సీఎం యోగి ప్రకటించారు.