-జీ-20 సందర్భంగా లక్షకు పైగా ప్రతినిధులు వచ్చారు
-రానున్నది పండుగల సమయం
– పండుగల వేళ మేడ్ ఇన్ ఇండియా గిఫ్లులనే కొందాం
-విశ్వవ్యాప్తమైన భారత సంగీతం
-ఘోడా లైబ్రరీ గురించి ప్రస్తావన
-చంద్రయాన్-3, జీ-20పై ప్రశంసలు
-మన్ కీ బాత్ లో ప్రధాని మోడీ
ఇండియా- మిడిల్ ఈస్ట్- యూరప్ ఎకనామిక్ కారిడార్ (Corridor) అనేది రాబోయే వంద సంవత్సరాల పాటు ప్రపంచ వాణిజ్యానికి ఆధారం కానుందని ప్రధాని మోడీ (PM Modi) అన్నారు. ఈ కారిడర్ భారత గడ్డపై ప్రారంభించబడిందని చరిత్ర ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటుందని తెలిపారు. అతి తక్కువ పెట్టుబడితో అతి ఎక్కువ మందికి టూరిజం సెక్టార్ (Tourism Sector) ఉద్యోగాలు కల్పిస్తోందని వెల్లడించారు.
మన్ కీ బాత్ 105వ ఎపిసోడ్ లో ప్రధాని మోడీ ఈ రోజు ప్రసంగించారు. చంద్రయాన్ ల్యాండర్ జాబిల్లిపై దిగబోతున్న సమయంలో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ఆ క్షణాలను వివిధ మాధ్యమాల ద్వారా తిలకించారని చెప్పారు. సుమారు 80 లక్షల మంది ఇస్రో యూట్యూబ్ ఛానెల్ లో చంద్రయాన్ ను వీక్షించాని తెలిపారు. తనకు ప్రధానంగా రెండు అంశాలపై భారీగా లేఖలు వచ్చాయన్నారు. అందులో చంద్రయాన్-3, జీ-20పైన ఎక్కువగా లేఖలు వున్నాయన్నారు.
చంద్రయాన్-3 విజయం, జీ-20 సమావేశాల నిర్వహణ ప్రతి భారతీయుడి సంతోషాన్ని రెటింపు చేసిందన్నారు. ఈ సమావేశాల్లో భారత మండపం ఒక సెలబ్రిటీలాగా మారిందన్నారు. చాలా మంది ఆ మండపం వద్ద సెల్ఫీలు తీసుకున్నారని, గర్వంగా వాటిని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారన్నారు. జీ-20 యూనివర్శిటీ కనెక్ట్ ప్రోగాం, చంద్రయాన్-3 మహా క్విజ్ లో పాల్గోవాలని కోరారు.
భారత్ పట్ల ప్రపంచ దేశాలకు పెరిగిన ఆసక్తి….!
ఈ నెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మాట్లాడుతూ….గత కొన్నేండ్లలో భారత్ పట్ల ప్రపంచ దేశాలకు ఆసక్తి పెరిగిందన్నారు. జీ-20 సందర్బంగా సుమారు లక్షకు పైగా ప్రతినిధులు భారత్ ను సందర్శించారన్నారు. ఇటీవల కర్ణాటకలోని శాంతినికేతన్, హోయసల దేవాలయాలను యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చిన విషయాన్ని ప్రధాని గుర్తు చేశారు. తక్కువ పెట్టుబడితో అత్యధిక ఉపాధిని కల్పించే రంగమేదైనా వుంటే అది టూరిజం సెక్టార్ మాత్రమేనన్నారు. ఏ దేశం పట్లనైనా సద్భావన, ఆకర్షణ చాలా ముఖ్యమన్నారు.
ఘోడా లైబ్రరీ గురించి ప్రస్తావన….!
పుస్తకాల ప్రాముఖ్యత గురించి ప్రధాని మోడీ వివరించారు. ఉత్తరాఖండ్‌లోని ‘ఘోడా లైబ్రరీ’ ప్రయత్నాలను ప్రధాని ప్రశంసించారు. అత్యంత మారుమూల ప్రాంతాల్లోని పిల్లలకు సైతం ఉచితంగా పుస్తకాలను చేరవేయడం ఈ లైబ్రరీకి వున్న అతిపెద్ద విశిష్టత అని కొనియాడారు. ఇప్పటి వరకు నైనిటాల్ లోని 12 గ్రామాలకు ఈ లైబ్రరీ పుస్తకాలను అందజేస్తోందన్నారు.
మేడ్ ఇన్ ఇండియా గిఫ్లులనే కొనండి…!
దేశంలో ఇప్పుడు పండుగల సమయం వస్తోందన్నారు. ఈ పండుగల సందర్భంలో వీలైనంత వరకు మేడ్ ఇన్ ఇండియా వస్తువులనే వినియోగించాలని, వాటినే గిఫ్టులుగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. మీ ఈ చిన్న ఆనందం మరో కుటుంబానికి పెద్ద సంతోషాన్ని ఇస్తుందని ప్రధాని సూచించారు. మీరు కొనే ఈ వస్తువుల ద్వారా ఈ దేశ శ్రామికులు, హస్త కళాకారులు, విశ్వకర్మ సోదర సోదరీమణులు ఇతరులు ప్రత్యక్షంగా లాభం పొందుతారన్నారు.
భారతీయ సంగీతం గురించి ప్రస్తావించిన ప్రధాని…!
భారతీయ సంస్కృతి, సంగీతం ఇప్పుడు విశ్వవ్యాప్తం అయ్యాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా వున్న ప్రజల్లో భారతీయ సంగీతం పట్ల ఆసక్తి పెరిగిపోతోందన్నారు. ఓ మ్యూజిక్ ను ప్లే చేస్తూ…. ఎంత మధురమైన స్వరం అని ప్రశంసించారు. ఆమె ప్రతి మాటలో ప్రతిబింబించే భావోద్వేగాల ద్వారా, భగవంతునిపై ఆమెకున్న ప్రేమను మనం అనుభూతి చెందగలమన్నారు. ఈ శ్రావ్యమైన స్వరం జర్మనీకి చెందిన ఒక కూతురికి చెందినదని అన్నారు. బహుశా ఆమె పేరు విని మీరు మరింత ఆశ్చర్యపోతారు! అని తెలిపారు.ఆమే పేరు – కసాండ్రా మే స్పిట్‌మాన్ అని వివరించారు.