నిజ్జర్ హత్య కేసు విచారణపై భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ (S.Jai Shankar) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. నిజ్జర్ హత్య కేసులో కెనడా (Canada) దర్యాప్తును తాము తోసిపుచ్చలేదని వెల్లడించారు. కానీ నిజ్జర్ హత్య కేసులో భారత ఏజెంట్ల పాత్ర ఉందని చేసిన ఆరోపణలకు సంబంధించి కెనడా ఇప్పటి వరకు తమతో ఎలాంటి సాక్ష్యాధారాలను పంచుకోలేదని ఆయన వెల్లడించారు.
లండన్‌లో స్థానిక మీడియాతో విదేశాంగ మంత్రి జైశంకర్ మాట్లాడారు. హింసాత్మక ధోరణికి, భారత్‌లో వేర్పాటు వాదాన్ని ప్రోత్సహించేలా తీవ్రమైన రాజకీయ అభిప్రాయాలకు కెనడా చోటు కల్పించినట్టు తాము భావిస్తున్నామని అన్నారు. వేర్పాటు వాదులకు కెనడాలో స్థానం కల్పించారని, వారి వేర్పాటు వాద భావాలను వెల్లడించేందకు కెనడా స్వతంత్ర్యం కల్పించిందన్నారు.
కెనడాలో భారత హై కమిషనర్ కార్యాలయంపై దాడి, భారత దౌత్యవేత్తలను బెదిరింపులకు గురి చేసినప్పుడు కెనడా స్పందించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. భారత్, కెనడాలు ప్రజాస్వామ్య దేశాలని చెప్పారు. ప్రజాస్వామ్య దేశంలో వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటన స్వేచ్చా కూడా ఒక నిర్ధిష్టమైన బాధ్యతతో ఉంటాయని జై శంకర్ పేర్కొన్నారు.
ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేయడం, రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఆయా హక్కులను ఉపయోగించుకోవడం సహించరాని నేరమని స్పష్టం చేశారు. కెనడాతో తాము చర్చలు జరిపినట్టు తెలిపారు. ఇప్పటికీ చర్చలు జరుపుతూనే ఉన్నామన్నారు. ఒక వేళ భారత్ పై అలాంటి ఆరోపణలు చేసేందుకు ఏదైనా కారణం ఉంటే, అలాంటి సాక్ష్యాధారాలను తమతో పంచుకోవాలని కోరుతున్నామన్నారు. కానీ ఇప్పటి వరకు కెనడా అలాంటి ఆధారాలు అందించలేదన్నారు.