Telugu News » India : రోహిత్ మెరుపులు…. శ్రేయస్ సమయోచిత బ్యాటింగ్… దాయాదిపై భారత్ ఘన విజయం…!

India : రోహిత్ మెరుపులు…. శ్రేయస్ సమయోచిత బ్యాటింగ్… దాయాదిపై భారత్ ఘన విజయం…!

ఈ సిరీస్‌లో భారత్ హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది.

by Ramu

– రోహిత్ శర్మ విధ్వంసం
– నిలబడ్డ శ్రేయాస్
– పాక్ పై భారత్ ఘన విజయం
– 192 పరుగులకే..
– కుప్పకూలిన దాయాది దేశం
– భారత బౌలర్ల దెబ్బకు విలవిల
– 30 ఓవర్లకే లక్ష్యం ఛేదించిన భారత్

చిరకాల ప్రత్యర్థి పాక్‌ పై భారత్ ఘన విజయం సాధించింది. ప్రపంచ కప్‌ లో పాక్ పై భారత్ కు తిరుగులేదని మరోసారి నిరూపితమైంది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మెరుపులు, శ్రేయస్ అయ్యర్ సమయోచిత బ్యాటింగ్‌ తో భారత్ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. దీంతో ఈ సిరీస్‌ లో భారత్ హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది.

 

పాక్ జట్టు నిర్దేశించిన 192 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు ఆదిలో ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ శుభమన్ గిల్ తక్కువ పరుగులకే ఔటయ్యాడు. 16 పరుగులు చేసిన గిల్.. షహీన్ అఫ్రిదీ బౌలింగ్ లో షాదాబ్ ఖాన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన రన్ మిషన్ విరాట్ కోహ్లీ కూడా నిరుత్సాహపరిచాడు. కేవలం 16 పరుగులు చేసి హసన్ అలీ బౌలింగ్ లో మహ్మద్ నవాజ్ క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు.

రోహిత్ శర్మ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. శ్రేయాస్ తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. సిక్సులు బాదుతూ పాక్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 86 పరుగులు చేసి రోహిత్.. షహీన్ అఫ్రిదీ బౌలింగ్ లో ఇప్తీకర్ అహ్మద్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత శ్రేయాస్, కేఎల్ రాహుల్ మరో వికెట్ పడకుండా ఆడారు. శ్రేయాస్ 53, కేఎల్ రాహుల్ 19 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.

పాక్ బౌలర్లలో షహీన్ రెండు వికెట్లు, హసన్ అలీ ఒక వికెట్ తీశారు. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టుకు ఓపెనర్లు శుభారంభాన్ని ఇచ్చారు. అబ్దుల్లా షఫీక్, ఇమామ్ ఉల్ హక్ లు కాస్త నిలకడగా ఆడారు. అయితే.. షఫీక్ 20 పరుగుల వద్ద సిరాజ్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ బాబర్ అజమ్ స్కోర్ బోర్డును చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. మరో ఓపెనర్‌ తో ఇమామ్ ఉల్ హక్ తో కలిసి ఆచితూచి ఆడాడు. ఇద్దరు క్రీజ్‌ లో కుదురుకుంటున్న సమయంలో హక్ 36 పరుగులు చేసి హర్దిక్ పాండ్యా బౌలింగ్‌ లో కేఎల్ రాహుల్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

ఆ తర్వత వచ్చిన మహ్మద్ రిజ్వాన్‌ తో కలిసి బాబర్ బాధ్యతాయుతమైన బ్యాటింగ్ చేశాడు. ఇరువురు కలిసి మూడవ వికెట్ కు 82 పరుగులు జోడించారు. 50 పరుగులు చేసిన అనంతరం సిరాజ్ బౌలింగ్ లో బాబర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు అందరూ వెంట వెంటనే పెవీలియన్ బాట పట్టారు. కేవలం హసన్ అలీ ఒక్కడే రెండంకెల స్కోర్(12) చేశాడు. మరోవైపు మహ్మద్ రిజ్వాన్ ఒంటరి పోరు చేశాడు.

49 పరుగులు చేసిన తర్వాత జట్టు స్కోరు 168 పరుగులు ఉండగా బుమ్రా బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మరో 23 పరుగులకే మిగతా బ్యాట్స్ మన్లు అంతా ఔట్ అయ్యారు. దీంతో 42.5 ఓవర్లలో 191 రన్స్ చేసింది పాక్. భారత బౌలర్లలో బూమ్రా, సిరాజ్, పాండ్య, కులదీప్ యాదవ్, జడేజా రెండేసి వికెట్ల చొప్పున వికెట్లు తీశారు. పాక్ లక్ష్యాన్ని భారత్ 30 ఓవర్లకే ముగించింది.

 

You may also like

Leave a Comment