ఆదిత్య ఎల్-1కు సంబంధించి ఇస్రో (ISRO) కీలక అప్ డేట్ ఇచ్చింది. ఆదిత్య సోలార్ అబ్జర్వేటరి మిషన్ శాస్త్రీయ డేటా (Scientifical Data) ను సేకరించడం మొదలు పెట్టినట్టు పేర్కొంది. ఆదిత్య ఎల్-1 మిషన్ లో అమర్చిన స్టెప్స్(STEPS)పరికరం సెన్సార్ తమ పనిని మొదలు పెట్టాయని తెలిపింది. స్టెప్స్ అనేది సుప్రా థర్మల్, ఎనర్జిటిక్ పార్టికల్ స్పెక్ట్రోమీటర్ పరికమని ఇస్రో వెల్లడించింది.
ఇది ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పెరిమెంట్ (ASPEX) పేలోడ్‌లో భాగమని తెలిపింది. ఇవి సుమారు 50 వేల కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న సూప్ర థర్మల్, ఎనర్జిటిక్ అయాన్స్, ఎలక్ట్రాన్స్‌ను కొలుస్తుందని వెల్లడించింది. భూమి చుట్టూ ఉండే కణాలను కొలిచేందుకు శాస్త్రవేత్తలకు చాలా ఉపయోగపడుతుందని పేర్కొంది.
STEPS లో మొత్తం ఆరు సెన్సార్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి వేర్వేరు దిశల్లో గమనించి, సుప్రా-థర్మల్, ఎనర్జిటిక్ అయాన్లను కొలుస్తుంది. తక్కువ, అధిక-శక్తి కణ స్పెక్ట్రో మీటర్లను ఉపయోగించి ఈ కొలతను నిర్వహిస్తుంది. భూమి కక్ష్యల సమయంలో సేకరించిన డేటా శాస్త్రవేత్తలకు భూమి చుట్టూ ఉన్న కణాల ప్రవర్తనను విశ్లేషించడానికి సహాయపడుతుందని ఇస్రో వర్గాలు వెల్లడించాయి.
మరోవైపు ఆదిత్య ఎల్1 ఈ రోజు అర్థరాత్రి వరకు కీలక దశకు చేరుకోనుంది. ఆదిత్య భూ ప్రదక్షిణ దశను ముగించుకుని ఈ నెల 19న ఉదయం 2 గంటల సమయంలో సూర్యుడి వైపు ప్రయాణం ప్రారంభించనుంది. అలా ప్రయాణిస్తూ ఇది సన్-ఎర్త్ లగ్రాంజ్ 1కు సమీపంగా చేరుకుంటుంది. ఈ పాయింట్ భూమికి సుమారు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.