భారత్‌లోనే అత్యంత పరిశుభ్రమైన నగరం(Cleanest City)గా మరోసారి ఇండోర్ నగరం నిలిచింది. క్లీనెస్ట్ సిటీల జాబితాలో అగ్రస్థానంలో ఇండోర్ (Indore) నిలవడం వరుసగా ఇది ఆరవసారి కావడం గమనార్హం. మరోవైపు ఈ ఏడాది మొదటి సారిగా ఇండోర్‌తో పాటు సూరత్ (Surat) కూడా సంయుక్తంగా క్లీనెస్ట్ సిటీగా నిలవడం విశేషం.
డైమండ్ సిటీ సూరత్ 2020 నుంచి ఈ జాబితాలో రెండవ స్థానంలో నిలుస్తూ వస్తోంది. ఈ జాబితాలో నావి ముంబై మూడవ స్థానంలో నిలిచింది. స్వచ్ఛ్ సర్వే క్షణ్-2023 ఫలితాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు. ఇక నాల్గవ స్థానంలో విశాఖ పట్టణం నిలిచింది. గతేడాది కూడా విశాఖ ఇదే స్థానంలో ఉండటం గమనార్హం. ఐదవ స్థానంలో భోపాల్ ఉంది.
ఇక గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఒక స్థానం దిగజారి విజయవాడ ఆరవ స్థానానికి చేరింది. ఏడవ స్థానంలో ఎన్డీఎంసీ ఉంది. ఇక గతేడాది ఏడవ స్థానంలో ఉన్న తిరుపతి ఒక స్థానం కోల్పోయి ఎనిమిదవ స్థానంలో నిలిచింది. ఇక తిరుపతి ఎనిమిదవ, గ్రేటర్ హైదరాబాద్ తొమ్మిదవ, పూణె పదవ స్థానంలో ఉన్నాయి. ఇక ఒక లక్ష కన్నా తక్కువ జనాభా గల నగరాల్లో మహారాష్ట్రలోని సస్వద్ మొదటి స్థానంలో నిలిచింది.
ఈ జాబితాలో చత్తీస్ గఢ్ లోని పఠాన్, మహారాష్ట్రలోని లోనావాలా రెండు, మూడవ స్థానాల్లో నిలిచాయి. కంటోన్మెంట్ ఏరియాల విభాగంలో ఎంహెచ్ఓడబ్ల్యూ మొదటి స్థానంలో ఉంది. ఇక గంగ టౌన్స్ జాబితాలో వారణాసి ఉత్తమ అవార్డును గెలుచుకుంది. రాష్ట్రల వారీగా చూస్తే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ రాష్ట్రాలు ఉన్నాయి.