ఐపీఎల్ 17(IPL 17)వ సీజన్‌కు అన్ని ఫ్రాంచైజీలు సిద్ధమయ్యాయి. ఇంకా రెండు వారాల్లో మొదలయ్యే మినీ వేలంలో స్టార్ ప్లేయర్లను కొనడంపై భారీ కసరత్తులు చేస్తున్నాయి. అయితే కొందరు స్టార్ ఆటగాళ్లు 2024 ఎడిషన్‌కు దూరం అయ్యే చాన్స్ ఉంది. ఈ జాబితాలో తాజాగా మరో స్టార్ బౌలర్ దూరం కానున్నాడు.
ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్(Jofra Archer) ఐపీఎల్ 17కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 17వ సీజన్ నుంచి వైదొలగాలని ఆర్చర్‌ను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు కోరింది. వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ ఉన్నందున వర్క్‌లోడ్ పడకుండా ఉండేందుకు ఐపీఎల్ ఆడొద్దని అతడిని అభ్యర్థించింది. ఒకవేళ ఈ స్టీడ్‌స్టర్ అందుకు అంగీకరిస్తే ముంబై ఇండియన్స్‌కు పెద్ద షాక్ తగిలినట్లే.
ఈ విషయంపై ఆర్చర్ స్పందించాల్సి ఉంది. ఈ స్టార్ పేసర్‌ను ఐపీఎల్ 2018 ఎడిషన్‌లో రాజస్థాన్ రాయల్స్ ఆర్చర్‌ను కొనుగోలు చేసింది. 2019 వరల్డ్ కప్‌లో అదరగొట్టాడు. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో బెన్ స్టోక్స్ చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంటే సూపర్ ఓవర్‌లో ఆర్చర్ సంచలన బౌలింగ్‌తో ఇంగ్లండ్‌ను విజేతగా నిలిపాడు.
ఆర్చర్ వచ్చే ఏడాది అమెరికా, వెస్టిండీస్ ఆతిథ్యం ఇస్తున్నటీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్‌కు కీలకం కానున్నాడు. 2022 మినీ వేలంలో ఈ పేసర్‌ను రూ.10 కోట్లకు ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. అయితే.. గాయం కారణంగా ఆర్చర్ టోర్నీ మధ్యలోనే స్వదేశం వెళ్లిపోవడంతో.. అతడి స్థానంలో ముంబై క్రిస్ జోర్డాన్‌ను ఆడించింది. అతడు ఈ మధ్యే కోలుకున్నాడు. ప్రపంచంలోని మేటి ఫాస్ట్ బౌలర్లలో ఆర్చర్ ఒకడు.