ఏపీ ఫైబర్ నెట్ (AP Fiber Net) స్కాంలో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu) బెయిల్ పిటిషన్ పై సుప్రీం కోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. జస్టిస్ అనిరుద్ధ్ బోస్, జస్టిస్ బేల ఎం. త్రివేదిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఫైబర్ నెట్ కేసుకు సంబంధించిన విషయాలపై ఎలాంటి కామెంట్స్ చేయవద్దని ఇరు వర్గాలకు ధర్మాసనం సూచించింది.
ఈ విషయంపై ఇరు పక్షాలు సంయమనం పాటించాలని ధర్మాసనం ఆదేశించింది. 17- ఏపై చంద్రబాబు దాఖలు చేసిన పిటీషన్‌పై తీర్పు ఇప్పటికీ పెండింగ్ లో ఉందని ధర్మాసనం తెలిపింది. ఆ అంశంపై తీర్పు వెలుపడిన తర్వాత ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరుపుతామని ధర్మాసనం వెల్లడించింది.
మరోవైపు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ (ఐఆర్ఆర్) కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. విచారణ సందర్బంగా…లింగమనేనికి లబ్ధి చేకూర్చేందుకు ఇన్నర్ రింగ్ రోడ్ ప్లాన్‌ను చంద్రబాబు కుటుంబసభ్యులు మార్చారని ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరాం వాదనలు వినిపించారు. మార్పులన్నీ చంద్రబాబు కనుసన్నల్లోనే జరిగాయని వాదించారు.
వాదనల అనంతరం పిటిషన్ పై విచారణను బుధవారానికి కోర్టు వాయిదా వేసింది. ఇక ఉచిత ఇసుక పథకంపై సీఐడి నమోదు చేసిన కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో కూడా ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. వాదనల అనంతరం కేసు తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.