గాజా (Gaza)లోని ఆల్ అహ్లీ అరాబి ఆస్పత్రిపై ఇటీవల రాకెట్ దాడికి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మొదట్లో ఆస్పత్రిపై ఇజ్రాయెల్ (Israel) రాకెట్ దాడి చేసిందని హమాస్ మిలిటెంట్ల సంస్థ ఆరోపించింది. ఈ క్రమంలో ఈ దాడికి ఇజ్రాయెల్ కారణమంటూ అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో ఈ వార్తలపై ఇజ్రాయెల్ స్పందించింది .
ఆ వార్తలను ఇజ్రాయెల్ సైన్యం తీవ్రంగా ఖండించింది. అసలు తాము ఆస్పత్రి సమీపంలో ఎలాంటి ఎయిర్ స్ట్రైక్స్ జరపలేదని పేర్కొంది. అలాంటి రాకెట్లు తమ సైన్యం దగ్గర లేవని స్పష్టం చేసింది. తాజాగా ఘటనకు సంబంధించి ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చినట్టు అంతర్జాతీయ మీడియా ఒకటి వెల్లడించింది. ఆ కథనం ప్రకారం…..
ఆ రాకెట్ దాడి వెనుక గాజాలోని ఇరాన్ మద్దతు గల ఇస్లామిక్ జిహాద్ ఉగ్ర సంస్థ హస్తం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆస్పత్రిపై దాడికి సంబంధించిన వీడియోలను ఇప్పుడు రక్షణ రంగ నిపుణులు పరిశీలిస్తున్నారు. ఆస్పత్రిపై దాడిని జియో లొకేషన్ మ్యాప్స్, ఆస్పత్రి భవనంలో జరిగిన విధ్వంసాన్ని పరిశీలించి పలు అంశాలను అంచనా వేస్తున్నారు.
రక్షణ రంగ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ దాడి గాజా నుంచే జరిగిందని అంటున్నారు. రాకెట్ మిస్ ఫైర్ కావడంతోనే ఇలా జరిగి వుంటుందని చెబుతున్నారు.
మరోవైపు ఆస్పత్రి పార్కింగ్ స్థలంలో ఎక్కువగా డ్యామెజ్ అయిందని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. దానికి సంబంధించి ఏరియల్ ఫోటో గ్రాఫ్స్ ను సాక్ష్యం చూపించింది. ఆస్పత్రి పార్కింగ్ స్థలంలో రాకెట్ పడినప్పుడు దాని లోని ఇంధన వల్ల అక్కడ డ్యామెజ్ అయిందని తెలిపింది. ఆస్పత్రి భవనానికి ఎలాంటి నష్టం జరగక లేదని రాకెట్ దాడి తీరుపై ఇజ్రాయెల్ అనుమానం వ్యక్తం చేసింది.
హమాస్ లక్ష్యంగా తాము చేస్తున్న ఎయిర్ స్ట్రైక్స్ లో బాంబులు పడితే ఆ భవనం నిర్మాణం మొత్తం సెకన్లలో నేల మట్టం అవుతుందని పేర్కొంది. కానీ ఆస్పత్రి ఘటనలో కేవలం పార్కింగ్ స్థలం మాత్రమే దెబ్బతిన్నదని వాదిస్తోంది. హమాస్ మిలిటెంట్ల ఆరోపణలు ప్రాతిపదికగా చేసుకుని వార్తలు రావడం, ఆల్ట్ న్యూస్ లాంటి పలు సంస్థలు అసత్య ప్రచారాలను చేయడంతో ఆ వార్తలు వైరల్ అయ్యాయని చెప్పింది.