గాజా (Gaza)లో కాల్పుల విరమణ (Cease Fire)ఒప్పందం అమలు మరింత జాప్యం కానుంది. ఇజ్రాయెల్-హమాస్ (Israel-Hamas) మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం కాల్పుల విరమణ నేటి నుంచి అమలులోకి రావాల్సి ఉంది. కానీ అలా జరగలేదు. ఒప్పందం అమలుకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని ఇజ్రాయెల్ వెల్లడించింది. ఈ క్రమంలో కాల్పుల విరమణ రేపు కూడా అమలులోకి రావడం కష్టమేనని తెలుస్తోంది.
ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమలులోకి వచ్చేందుకు మరింత సమయం పడుతుందని ఇజ్రాయెల్ భద్రతా సలహాదారు షసి హేంజ్ బీ వెల్లడించారు. ఒప్పందం అమలులో జాప్యానికి గల కారణాలను ఆయన వెల్లడించలేదు. ఇటీవల తమ వద్ద బంధీలుగా ఉన్న వారిని విడుదల చేసే విషయంలో ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఒప్పందం కుదిరింది.
ఒప్పందం ప్రకారం 50 మంది బందీలను హమాస్ మిలిటెంట్లు, 150 మంది బందీలను పాలస్తీనా విడుదల చేయాలని నిర్ణయించాయి. ఒప్పందం మేరకు నాలుగు రోజుల పాటు కాల్పుల విరమణ పాటించాలని నిర్ణయానికి వచ్చాయి. మరోవైపు కాల్పుల విరమణ సమయంలోనే గాజాలోకి మరింత ఇంధనం, మానవతా సహాయాన్ని అందించేందుకు ఇజ్రాయెల్ అంగీకరించింది.
ఇది ఇలా వుంటే ఒప్పందాన్ని అమలు చేస్తే ఇప్పుడు ఉన్న యుద్ద వాతావరణాన్ని కొనసాగించడం ఇజ్రాయెల్ కు కష్టంగా మారుతుంది. ఇక గాజాలోని హమాస్ స్థావరాలన్నింటినీ ధ్వంసం చేస్తామని ఇజ్రాయెల్ కంకణం కట్టుకుంది. అలాంటి తరుణంలో ఆ లక్ష్యాలు నెరవేరకుండానే యుద్దాన్ని నిలిపి వేసినట్టు అవుతుందని ఇజ్రాయెల్ భావిస్తున్నట్టు సమాచారం. ఇక నాలుగు రోజుల తర్వాత దాడులు కొనసాగుతాయని ఇజ్రాయెల్ ప్రధాని ఇప్పటికే ప్రకటించారు.