ఇజ్రాయెల్(Israel)పై హమాస్(Hamas) 2023, అక్టోబర్ 7వ తేదీన చేసిన మెరుపుదాడులతో ప్రారంభమైన గాజా యుద్ధం(Gaza War)ఇంకా కొనసాగుతూనే ఉంది. తమపై ఉగ్రదాడులకి పాల్పడినందుకు గానూ హమాస్‌ను అంతమొందించే వరకూ వెనకడుగు వేసేది లేదని ఇజ్రాయెల్ శపథం పన్నింది. ఈ యుద్ధం ప్రారంభమై ఆరు నెలలు గడిచిన తరుణంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తాజాగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
దక్షిణ గాజా నగరమైన రఫాను ఆక్రమిస్తామని నెతన్యాహు ప్రతిజ్ఞ చేశారు. దీనిపై దండెత్తేందుకు ఒక తేదీ ఉందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో ప్రకటనను విడుదల చేశారు. అయితే, ప్రపంచ దేశాలు నెతన్యాహు మాటలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. గాజా యుద్ధంలో తాము ఒక్క అడుగు దూరంలోనే ఉన్నామని, బందీలను హమాస్ విడిచిపెట్టేదాకా ఎలాంటి సంధి ఉండబోదని నెతన్యాహు ఇదివరకే తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే.
అదేవిధంగా హమాస్‌కు బలమైన స్థావరంగా ఉన్న రఫాకు బలగాలను పంపిస్తామని నెతన్యాహు పునరుద్ఘాటించారు. అయితే నెతన్యాహు వ్యాఖ్యలను అమెరికా సహా అంతర్జాతీయ సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రఫాకు బలగాలను పంపిస్తే అక్కడ ఆశ్రయం పొందుతున్న సుమారు 14లక్షల మంది పౌరుల జీవితాలు ప్రమాదంలో పడతాయంటూ ఆందోళన వ్యక్తం చేసింది.
ఇక ఏప్రిల్ 1న గాజాలో జరిపిన వైమానిక దాడిలో యూఎస్ ఆధారిత ఫుడ్ ఛారిటీ వరల్డ్ సెంట్రల్ కిచెన్‌కు చెందిన ఏడుగురు సహాయక సిబ్బంది మృతిచెందారు. అప్పటి నుంచి ఇజ్రాయెల్ అంతర్జాతీయంగా విమర్శలను ఎదుర్కొంటోంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. నెతన్యాహుకి బైడెన్ ఫోన్ చేసి తక్షణమే కాల్పుల విరమణకు డిమాండ్ చేశారు. దీని వెనుక ఇరాన్ ఉందంటూ చెప్పుకొచ్చారు. ఇబ్బంది పెట్టినవారిని వదలమని బైడెన్ చెప్పగా తామూ ఆచరణలో పెట్టామని నెతన్యాహు చెప్పుకొచ్చారు.