ఇజ్రాయెల్ సైబర్ టెక్ సంస్థ ‘సైబర్ టెక్’ సంస్థ ‘సెలబ్రైట్’ .. భారత, పాకిస్తాన్ దేశాలకు హైటెక్ మొబైల్ ఫోన్ హ్యాకింగ్ టూల్ ని అమ్ముతోందన్న షాకింగ్ విషయం వెల్లడైంది. సుమారు పదేళ్లుగా ‘ యుఫెడ్’ (యూనివర్సల్ ఫోరెన్సిక్ ఎక్స్ ట్రాక్షన్ డివైజ్) పేరిట ఈ హ్యాకింగ్ టూల్ ని విక్రయిస్తున్నట్టు ఇజ్రాయెల్ పత్రిక ‘హారెట్జ్’ తెలిపింది. 2012 నుంచి డిజిటల్ ఇంటెలిజెన్స్ కంపెనీ సెలబ్రైట్ రూపొందించిన వివిధ అత్యాధునిక ప్రాడక్టులను పాకిస్తాన్ లోని ఫెడరల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ వినియోగిస్తోందని ఈ పత్రిక ఓ ఆర్టికల్ ని ప్రచురించింది.
ఒక విధంగా చెప్పాలంటే ఇది పూర్తిగా ఫోన్ ని హ్యాక్ చేసి సమాచారాన్నంతా రాబట్టడమే.. ఇన్వెస్టిగేటర్లు ప్రజల ఫోన్ల నుంచి ఫోటోలు, డాక్యుమెంట్లు, మెసేజులు, కాల్ హిస్టరీలు, కాంటాక్టులు తదితరాలను, పాస్ వర్డ్ ని హ్యాక్ చేసి మొత్తం సమాచారాన్ని కాపీ చేసుకోవడానికి ఇది ఉపకరిస్తోందని సైబర్ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పాక్ కు ఈ తరహా ఫోన్ హ్యాకింగ్ టూల్ ని అమ్మడంవల్ల దీన్ని అక్కడి కొందరు అధికారులు దుర్వినియోగం చేయవచ్చునని, మహిళలు, మైనారిటీలు, జర్నలిస్టులను సైతం వేధించడానికి దోహదపడుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.
ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు వినియోగిస్తున్న టెక్నాలజీలు వాటికి మాత్రమే పరిమితం కావని, ఇలాంటి టెక్నాలజీ సంబంధ ప్రాడక్టులను ఇతర వెండార్లు కూడా వినియోగించవచ్చునన్నది వారి విశ్లేషణ. ఏమైనా ఈ విధమైన టూల్స్ మానవ హక్కుల యాక్టివిస్టులపైన, ప్రజలపైన నిఘా వేయడానికి కూడా దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని మరొక నిపుణుడు చెప్పారు. లోగడ ఇజ్రాయెల్ పెగాసస్ స్పై వేర్ వంటిది ఇండియాతో బాటు పలు దేశాల్లో పెను వివాదానికి దారి తీసిన విషయాన్నీ కూడా ఈ పత్రిక గుర్తు చేసింది.
తమ టూల్స్ టెర్రరిజం వంటి సీరియస్ నేరాలను అదుపు చేయడంలో పోలీసులకు . ఇతర దర్యాప్తు సంస్ధలకు తోడ్పడుతుందని, అందుకే దీన్ని అమ్ముతున్నామని ‘సెలబ్రైట్’ సీఈఓ యోస్సీ కార్మిల్ సమర్థించుకుంటున్నా.. ఒక్కోసారి ఇది దుష్టశక్తుల చేతిలోకి పోవచ్చునని ఈ పత్రిక పేర్కొంది. ఇండియాకు ఈ టూల్ ని విక్రయిస్తున్నా.. దీన్ని ఈ దేశంలో దుర్వినియోగం చేసే ప్రమాదం లేదని మరికొందరు నిపుణులు పేర్కొన్నారు.