ఒడిశా (Odisha)..జార్ఖండ్ (Jharkhand)లో ఉన్న బౌద్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఆదాయపు పన్ను శాఖ గురువారం రెయిడ్స్ నిర్వహించింది. ఒడిశాలోని బోలంగీర్, సంబల్‌పూర్, జార్ఖండ్‌లోని రాంచీ, లోహర్‌దాగాలో దాడులు నిర్వహించినట్లు ఆదాయపు పన్ను శాఖ వర్గాలు తెలిపాయి. బల్దేవ్ సాహు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సత్పురా కార్యాలయంలోనూ రెయిడ్స్ నిర్వహించినట్టు తెలుస్తుంది.
ఈ సందర్భంగా కంపెనీ కార్యాలయంలో భారీగా నగదును స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఇంత మొత్తంలో నగదు దొరకడంతో వాటిని లెక్కించేందుకు ఐటీ శాఖ పెద్ద సంఖ్యలో కౌంటింగ్ మిషన్లను ఆర్డర్ చేయాల్సి వచ్చింది. మరోవైపు జార్ఖండ్‌కు చెందిన కాంగ్రెస్ (Congress) నేత, రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహు నివాసం, కార్యాలయంలో జరిగిన ఐటీ రెయిడ్స్ (IT Raids)లో రూ.200 కోట్లకు పైగా నగదు దొరకడం కలకలం సృష్టిస్తుంది.
ఆదాయపు పన్ను శాఖకు చెందిన 36 బృందాలు.. ఒడిషా, జార్ఖండ్, బెంగాల్‌లలోని 36 ప్రాంతాల్లో ఏకకాలంలో రెయిడ్స్ నిర్వహించాయి.. కాగా ఇప్పటి వరకు పట్టుబడిన మొత్తం విలువ రూ.510 కోట్లకు పైనే వుంటుందని ప్రచారం జరుగుతుంది. కౌంటింగ్ ఇంకా పూర్తికానందున ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం..
మరోవైపు కాంగ్రెస్ నేత దగ్గర భారీగా నగదు పట్టుబడ్డ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ (Modi) కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ప్రజలు ముందు, నేతల దగ్గర కుప్పలు తెప్పలుగా ఉన్న కరెన్సీ నోట్లను చూడాలని, ఆ తర్వాత ప్రతిపక్ష నేతల ప్రసంగాలు వినాలంటూ చురకలంటించారు. దేశ ప్రజల నుంచి దోచుకున్న ప్రతి పైసా తిరిగి ఇవ్వాల్సిందే అంటూ ప్రధాని వ్యాఖ్యానించారు.