ప్రత్యేక తెలంగాణ(Telangana) ఏర్పాటులో మాజీ కేంద్ర మంత్రి, దివంగత నేత జైపాల్‌రెడ్డి(Jaipalreddy) ఎంతో కృషి చేశారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(Minister Komatireddy Venkat Reddy) కొనియాడారు. హైదరాబాద్(Hyderabad) నెక్లెస్ రోడ్‌లోని స్ఫూర్తి స్థల్ వద్ద మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి 82వ జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. జైపాల్ రెడ్డి ఆకాంక్షించిన తెలంగాణను నిర్మిస్తామని చెప్పారు. జైపాల్‌రెడ్డి పేరుపై కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేస్తామని చెప్పారు. తెలంగాణ ఏర్పాటుకు నాటి ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఒప్పించడంలో జైపాల్ రెడ్డి కీలక పాత్ర పోషించారని తెలిపారు.
తెలంగాణ ఏర్పాటు ఖాయమని, ఎవరూ ఆత్మహత్యకు పాల్పడవద్దని ఉద్యమకారులకు ధైర్యం చెప్పేవారని గుర్తుచేసుకున్నారు. తెలంగాణ ఏర్పాటు కావటానికి మలిదశ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారన్నారు. తెలంగాణ చరిత్రలో ఆయన పేరు నిలిచిపోయేలా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టే విషయంపై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించారు.
మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. ఈ తరం నాయకులు జైపాల్ రెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. హైదరాబాద్ నగరానికి మెట్రో వచ్చిందంటే జైపాల్ రెడ్డి కృషి ఫలితమేనన్నారు. హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం అవుతుందని ఏపీ నాయకులు ప్రచారం చేసినా అలా జరగకుండా చర్యలు తీసుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన కుటుంబసభ్యులతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.