ముష్కరులకు ఎలాంటి నియమాలు ఉండనప్పుడు.. దాడులకు ప్రతిస్పందన కూడా అలాగే ఉంటుందని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్ (S Jaishankar) అన్నారు. పదేళ్లలో దేశ విదేశాంగ విధానంలో గణనీయమైన మార్పు వచ్చిందని ఉగ్రవాదాన్ని(Terrorism) ఎదుర్కొనేందుకు ఈ మార్పే సరైన విధానమని తెలిపారు. మహారాష్ట్రలోని పుణెలో జరిగిన ఓ కార్యక్రమంలో జైశంకర్ పాల్గొన్నారు.
ఉగ్రవాద ముప్పు, దేశ దౌత్య సంబంధాల వంటి అంశాలపై యువత అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. ఏయే దేశాలతో సంబంధాలు కొనసాగించడం కష్టంగా ఉందని అడగ్గా.. పొరుగున ఉన్న పాకిస్థాన్ (Pakistan) అని వెల్లడించారు. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించేది లేదని దాయాదిని ఉద్దేశిస్తూ మరోసారి ఆమోదించేది లేదని పాక్‌ను ఉద్దేశించి అన్నారు.
పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని తమ ప్రయోజనాలకు ఉపయోగిస్తోందని మనం మొదటి నుంచీ స్పష్టంగా ఉంటే అప్పుడు భారత విదేశాంగ విధానం భిన్నంగా ఉండేదని జైశంకర్ అభిప్రాయపడ్డారు. అయితే, 2014 నుంచి మన విదేశీ విధానంలో 50శాతం మార్పు వచ్చిందని తెలిపారు. అదీ ఉగ్రవాదంపై మనం స్పందించే తీరులోనే అని స్పష్టం చేశారు.
ముంబై దాడుల తర్వాత భారత్ స్పందించాలని అందరూ కోరుకున్నారని, అలా చేయకపోవడమే వల్లే ఎక్కువ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందన్నారు. ఒకవేళ, 26/11 ముంబయి పేలుళ్ల వంటి ఘటన ఇప్పుడు జరిగితే దానికి మనం ప్రతీకారం తీర్చుకోకపోతే తర్వాత దాడులను మనం ఎలా నిరోధించగలమని జైశంకర్ అన్నారు. ఉగ్రవాదులు ఎలాంటి రూల్స్ పెట్టుకుని దాడులు చేయరు అలాంటప్పుడు ప్రతి చర్యలకూ ఎలాంటి నియమాలు లేకపోవడం అవసరమని జైశంకర్ పునరుద్ఘాటించారు.