అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు(AP Politics) ఆసక్తికరంగా మారాయి. పార్టీలో సీటు రాని అభ్యర్థులు పక్కచూపులు చూస్తున్నారు. ఇప్పటికే ప్రధాన పార్టీల్లో అనేక మంది నేతలు రాజీనామాలు చేసి ఇతర పార్టీల్లో చేరారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా(Konaseema District) రాజోలు(Rajolu) నియోజకవర్గంలో రోజురోజుకి సమీకరణాలు మారుతున్నాయి.
రాజోలు స్థానంపై ప్రత్యేక దృష్టి సారించారు జనసేనాని పవన్ కల్యాణ్. ఈ ఎన్నికల్లో మరోసారి ఆ స్థానాన్ని దక్కించుకునేలా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. రాజోలు బీఫామ్‌ను రిటైర్డ్ ఐఏఎస్ దేవ వరప్రసాద్‌కు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జనసేన పార్టీకి బిగ్ షాక్ తగిలింది. రాజోలు నుంచి టికెట్ ఆశించిన బొంతు రాజేశ్వర రావు జనసేన పార్టీకి రాజీనామా చేశారు.
రేపు జగన్ సమక్షంలో కాకినాడలో సొంత గూటికి బొంతు రాజేశ్వరరావు చేరునున్నారు. అయితే, రాజోలు నియోజకవర్గానికి జనసేన పార్టీలో ఒక ప్రత్యేక అనుంబంధం ఉందని చెప్పవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా గత ఎన్నికల్లో జనసేనకు ఎదురుగాలి వీచినా.. రాజోలులో మాత్రం జనసేన జెండా ఎగిరింది.
రాజోలు నియోజకవర్గ ప్రజలు ఆ స్థానం నుంచి జనసేన తరఫున పోటీ చేసిన రాపాక వరప్రసాద్‌కు విజయాన్ని కట్టబెట్టారు. అయితే ఆయన అనూహ్యంగా వైసీపీలో చేరారు. దీంతో జనసేన చేతి నుంచి ఆ ఒక్క సీటు కూడా చేజారింది. ఈసారి టికెట్ కోసం జనసేనకు వచ్చిన ఆయనకు సీటు ఇవ్వకపోవడంతో వరప్రసాద్ మళ్లీ వైసీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది.