ఏపీకి ప్రత్యేక హోదా(AP Special Status) ఇవ్వడం కేంద్రం బాధ్యత అని జై భారత్ (ఎన్) పార్టీ (Jai Barath) అధ్యక్షుడు మాజీ జేడీ లక్ష్మీ నారాయణ (JD Lakshmi Narayana) తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా అధ్యాయం ముగిసిందని అంటున్నారని చెప్పారు. కానీ ఆ అధ్యాయం ఇప్పుడే మొదలైందని వెల్లడించారు.
రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ప్రత్యేక హోదా సాధన కోసం బ్యాడ్జీలు ధరించి పోరాటం చేద్దామని మాజీ జేడీ పిలుపునిచ్చారు. ఏపీ ప్రత్యేక హోదాపై మాజీ జేడీ తమ కార్యాచరణను ప్రకటించారు. విజయవాడలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ….. పార్లమెంట్‌లో ఏపీకి హోదా ఐదేళ్లు కావాలని అప్పటి ప్రభుత్వం చెప్పిందన్నారు.
కానీ పదేళ్లు కావాలని బీజేపి చెప్పిందని ఆయన గుర్తు చేశారు. పార్లమెంట్ లో ఇచ్చిన హామీలు అమలు చేయలేనప్పుడు పార్లమెంట్ కు విలువ ఏముంటుందన్నారు.
కేవలం ఎన్నికల కోసమే టీడీపీ వైసీపీలు ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తుతున్నాయని విమర్శలు గుప్పించారు. కేవలం రాజకీయ పార్టీలు కాకుండా ప్రజలు ఉద్యమిస్తేనే హోదా వస్తుందన్నారు.
ఈరోజు నుంచి ప్రత్యేక హోదా కోసం తాను ఈ బ్యాడ్జీని తగిలిస్తానని పేర్కొన్నారు. జనవరి 26న గణతంత్ర దినోత్సవం రోజు ప్రత్యేక హోదా కోసం ప్రతిజ్ఞ చేద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతి ఛానల్ కూడా తమ లోగో పక్కన హోదా లోగోను కూడా పెట్టాలని కోరారు. తమిళనాడులో జల్లికట్టు కోసం ప్రజలు ఉద్యమం చేసి సాధించారని అలాగే ఏపీలో కూడా ప్రజలు ఉద్యమిస్తేనే ప్రత్యేక హోదా వస్తుందన్నారు.