తెలంగాణలో కాంగ్రెస్(Congress) అధికారంలోకి వచ్చాక రెండు భారీ కుంభకోణాలు జరిగాయని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి(Jeevan Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రూ. 1450 కోట్ల వడ్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. అందుకు సంబంధించి తాను రెండు రోజుల్లో ఈడికీ, సీబీఐకీ పిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ అంటేనే కరప్షన్ పార్టీ అని జీవన్ రెడ్డి ఆరోపించారు. వడ్ల కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంటే.. ఆ డబ్బులు ఎవరి చేతుల్లోకి వెళ్తున్నాయో తనవద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు జరిగిన అవినీతిలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని దర్యాఫ్తు జరిపించాలని కోరారు. కాంగ్రెస్ నాయకులతో బీజేపీ నాయకులు చేతులు కలిపారని తెలిపారు. అందుకే వాళ్ళు ఏం మాట్లాడటంలేదన్నారు.
మరోవైపు రాష్ట్రంలో RR కుంభకోణం జరుగుతుందని.. RR అంటే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి అని సెటైర్లు వేశారు. రేవంత్ రెడ్డిది స్కీమ్‌ల పాలన కాదు.. స్కామ్‌ల పాలన నడుస్తోందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలకు ఎన్నికల ప్రచారంలో 6 గ్యారెంటీలు, 420 హామీలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్.. అధికారంలోకి రాగానే ప్రజలను మోసం చేస్తున్నారని జీవన్ రెడ్డి మండిపడ్డారు. కార్తీక దీపం సీరియల్ లాగా కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు చేస్తున్నారని విమర్శించారు.
అదేవిధంగా బీఆర్ఎస్ హయంలో వడ్లను ఎక్స్పోర్ట్ చేస్తే రేవంత్ రెడ్డి హయాంలో డబ్బులను ఎక్స్పోర్ట్ చేస్తున్నారని జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. బీజేపీకి, బీఆర్ఎస్ బీ టీమ్ కాదనీ.. బీ టీమ్ అయితే బీజేపీ నాయకులను ఎందుకు ఓడిస్తామని అన్నారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణ కంటే ధన సేకరణ ఎక్కువగా నడుస్తోందని జీవన్ రెడ్డి ఆరోపించారు. ఇళ్లు కట్టుకుందామంటే ఇల్లుకి పర్మిషన్ ఇవ్వడం లేదని.. డబ్బులు ఇస్తేనే పర్మిషన్ అని అంటున్నారని ఫైర్ అయ్యారు.
అయితే, ఇచ్చిన డబ్బులను ఢిల్లీకి మోస్తున్నారని విమర్శించారు. తులం బంగారం ఇస్తామని చెప్పి ఇవ్వకుండా మహిళలను కాంగ్రెస్ మోసం చేస్తోందన్నారు. విశ్వాసఘాతకులు రంజిత్ రెడ్డి, కడియం శ్రీహరి కవిత జైలుకు పోతుంటే నవ్వుకుంటూ కాంగ్రెస్ పార్టీలో చేరారని మండిపడ్డారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల ఇంటి దగ్గర చావు డప్పు కొడతామని హెచ్చరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఈసారి బీఆర్ఎస్ పార్టీ 17కు 17స్థానాలు గెలుస్తామని జీవన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.