అమెరికా అధ్యక్షుడు జోబైడెన్(Joe Biden) కాన్వాయ్‌కు చెందిన సెక్యూరిటీ వాహనాన్ని ఆదివారం రాత్రి ఓ గుర్తుతెలియని ప్రైవేటు కారు(Private Car) ఢీకొట్టింది. ఈ ఘటనలో అధ్యక్ష దంపతులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని శ్వేతసౌధం వర్గాలు వెల్లడించాయి.
అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ చేసేందుకు విస్తృత సన్నాహాలు చేసుకుంటున్న బైడెన్, ఆదివారం రాత్రి డెలావర్‌లోని విల్మింగ్టన్లో తన ప్రచార కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. అధ్యక్ష దంపతులు వారితోనే విందు చేసిన తర్వాత తిరిగి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అదే సమయంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
ఒక కారు అధ్యక్షుడి కాన్వాయ్‌ను ఢీకొట్టినట్లు తెలుస్తోంది. వారి షెడ్యూల్ సమావేశానికి 130 అడుగుల దూరంలో ఈ ఘటన జరిగిందని పేర్కొంది. తిరిగి అదే మార్గంలో వెళ్లేందుకు డ్రైవర్ ప్రయత్నించగా సీక్రెట్ సర్వీస్ అధికారులు ఆయుధాలతో అతడి కారును చుట్టుముట్టారు.
కారు ఢీకొన్న సమయంలో బైడెన్ దంపతులు కాన్వాయ్ దగ్గరకు నడిచి వస్తున్నట్లు అమెరికా శ్వేతాసౌధం వెల్లడించింది. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అక్కడే ఉన్న బైడెన్, ఆయన భార్య జిల్ బైడెన్‌ను వెంటనే అక్కడి నుంచి పంపించేశారు. అధ్యక్ష దంపతులు క్షేమంగా ఉన్నట్లు వెల్లడించారు.