హమాస్ దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ (Israel) చేపట్టిన యుద్ధంతో గాజా ప్రజలు తినడానికి తిండిలేక ఆకలితో అలమటిస్తున్నారు. ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఈ నేపథ్యంలో అక్కడికి మానవతా సాయాన్ని అనుమతించాలని ప్రపంచ దేశాలు ఒత్తిడి పెంచాయి. ఈ మేరకు గాజా(Gaza)లోకి మరింత సహాయ సామగ్రిని చేర్చే దిశగా అమెరికా చర్యలు చేపడుతోంది.
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో అగ్రరాజ్యం అధ్యక్షుడు బైడెన్ ఆదివారం ఫోన్లో మాట్లాడారు. ఆహార పదార్థాలు, నిత్యావసరాలు సహా ఇతర సహాయ సామగ్రిని అనుమతించేందుకు మరిన్ని దారులను తెరుస్తామని నెతన్యాహు హామీ ఇచ్చారు. ఈవారంలోనే ఆ దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీంతో ఉత్తర సరిహద్దుల్లో మరికొన్ని దారులు తెరవడానికి ఇజ్రాయెల్ అంగీకారం తెలిపింది.
గతంతో పోలిస్తే గాజాలోకి మానవతా సాయం ముమ్మరంగా చేరుతోందని బైడెన్ తెలిపారు. ఇది ఇలాగే కొనసాగేందుకు సహకరించాలని నెతన్యాహుకు సూచించారు. హమాస్ చెరలో ఉన్న బందీలను వెంటనే విడిచిపెట్టాలని బైడెన్ డిమాండ్ చేశారు. తద్వారా కాల్పుల విరమణ, గాజా పునఃనిర్మాణం దిశగా ముందడుగు వేయాలని హమాస్‌కు సూచించారు. మరోవైపు ఇజ్రాయెల్ భద్రతా విషయంలో అమెరికా ఏమాత్రం వెనకడుగు వేయబోదని బైడెన్ హామీ ఇచ్చారు.
ఇరాన్‌తో ఉద్రిక్తతల సమయంలో అందించిన ఆపన్నహస్తమే అందుకు ఉదాహరణ అని పునరుద్ఘాటించారు. రఫాలోనూ భూతల దాడులు ప్రారంభిస్తే గాజాలోని మిగిలిన ప్రాంతంతో దానికి సంబంధాలు తెగిపోనున్నాయి. అప్పుడు ఈ దారులే కీలకమవుతాయి. రఫాలోని దాదాపు పది లక్షల మంది పాలస్తీనావాసులకు రక్షణ కల్పించని ఏ ఆపరేషన్‌కూ అమెరికా మద్దతు ఉండబోదని బైడెన్ ఈ సందర్భంగా తేల్చి చెప్పినట్లు శ్వేతసౌధం ప్రకటించింది. రఫా ఆక్రమణను అగ్రరాజ్యం తొలి నుంచీ వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.