ప్రధాని మోడీ (Modi) ఆదిలాబాద్ జిల్లా పర్యటనపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ (BRS) జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న (Jogu Ramanna) సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రధాని పర్యటనపై ఆశలు పెట్టుకున్న ప్రజలకు నిరాశే మిగిలిందని తెలిపారు.. ఇది ముమ్మాటికి సంకల్ప సభ కాదు. ప్రజలను నిరాశపర్చిన సభగా అభివర్ణించారు. ఆదిలాబాద్‌లో మీడియాతో మాట్లాడిన రామన్న.. టెక్స్ టైల్ పార్కు ఇవ్వని మోడీ.. ఎందుకు వచ్చినట్టని ప్రశ్నించారు.
సిసిఐ పరిశ్రమతో పాటు.. అదిలాబాద్ (Adilabad)టు ఆర్మూర్ రైల్వే లైన్, విమానాశ్రయ ఏర్పాటు తో పాటు టెక్స్టైల్ పార్క్ నిర్మాణంపై ఎంతగానో ఎదురుచూస్తున్న ఆదిలాబాద్ ప్రజానీకాన్ని ప్రధాని మరోసారి నిరాశ నిస్పృహలకు గురి చేశారని ఆరోపించారు.. బీజేపీ (BJP) నేతలు ఆదిలాబాద్ పై చిన్న చూపు చూసారని విమర్శించారు. రాష్ట్రంలో నలుగురు ఎమ్మెల్యేలను ప్రజలు గెలిపిస్తే.. మీరిచ్చే గౌరవం ఇదేనా అని మండిపడ్డారు.
ప్రజల సొమ్ముతో ఎన్నికల సభ నిర్వహించారని, ఇప్పటి దాకా మీ డ్రామాలు నడిచాయని అన్నారు.. మోడీ, రేవంత్ రెడ్డి పొగుడుకోవడం తప్ప జిల్లా ప్రజలకు ఒరిగింది ఏంటని ప్రశ్నించారు.. గతంలో కేంద్రహోంశాఖ సహాయ మంత్రి సీసీఐను సందర్శించి త్వరలోనే ప్రారంభిస్తామని హామీ ఇచ్చినా ఇంతవరకు ఉలుకు పలుకు లేదని రామన్న ఆరోపించారు. ఆదివాసీలు అని గొప్పలు చెప్పే బీజేపీ.. ఆదివాసీ అయిన సిట్టింగ్ ఎంపీకి ఎందుకు టికెట్ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ (Congress), బీజేపీ నేతల మధ్య ఉన్న రహస్య ఒప్పందం నిన్నటి సభతో బయటపడిందన్నారు.. ఈ రెండు పార్టీలు గ్యారంటీల పాట పాడుతు ప్రజలను మభ్యపెట్టడం అలవాటు చేసుకొన్నాయని విమర్శించారు. నిన్నటి దాకా చౌకిదారు.. ఇప్పుడు మోడీకా పరివార్ అంటూ సెటైర్లు వేశారు.. వారసులు ఉంటే తప్పేం కాదు.. నీకు వారసులు లేరని, మా పార్టీల నుంచి తీసుకొని తెల్లారే టికెట్లు ఇస్తున్నారన్నారని రామన్న మండిపడ్డారు..