ఐపీఎల్(IPL)లో రాజస్థాన్ ప్లేయర్ జోస్ బట్లర్(Jos Buttler) అద్భుత ఆటతీరుతో అందరినీ ఆకట్టుకున్నాడు. భారీ లక్ష్య ఛేదనలో కోల్‌కతా పై చివరి బంతి వరకూ పోరాడి జట్టు గెలుపులో కీలకంగా వ్యవహరించాడు. గాయం కారణంగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడలేకపోయినా కోల్‌కతాపై నొప్పిని భరించీమరీ పోరాడాడు.
శతకం(107) పూర్తి చేసిన ఈ ప్లేయర్ ఓ వైపు వికెట్లు పడుతున్నా ఏమాత్రం ఏకాగ్రతను కోల్పోకుండా ఆడి జట్టును విజయతీరానికి తీసుకెళ్లాడు. మ్యాచ్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. భారీ లక్ష్యాన్ని ఛేదించాల్సి వచ్చినప్పుడు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని తెలిపాడు. అదే ఆటలో కీలకమని అభిప్రాయపడ్డాడు.
బాగా ఆడలేనప్పుడు నిరుత్సాహానికి గురికావడం సహజమని, ఒకటీ రెండు షాట్లు తగిలేవరకూ అలాగే ఆడాలని నా మనస్సుకు సర్ది చెబుతానంటూ చెప్పాడు. ఐపీఎల్లో భారీ లక్ష్యాలను ఛేదించే వారిలో ధోనీ, విరాట్ కోహ్లీ ఆదర్శమని బట్లర్ వెల్లడించాడు. చివరి వరకూ క్రీజ్‌లో ఉండి వారు చేసే మ్యాజిక్‌నే నేను అనుసరించానని తెలిపాడు.
అలాగే తన డైరెక్టర్ కుమార సంగక్కర మాటలు తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయని చెప్పాడు. ఎక్కడో ఒక చోట బ్రేక్ పాయింట్ ఉంటుందని ఆయన చెప్పేవారని, అది బాగా వర్కౌట్ అయిందని పేర్కొన్నాడు. దాని కోసం వేచి చూసి బౌలర్లపై ఎదురు దాడి చేశానని, కనీస పోరాటం చేయకుండా వికెట్ సమర్పించుకోవడం అత్యంత దారుణమని తెలిపాడు.