వచ్చేది పాల్ ప్రభుత్వమేనని ప్రజాశాంతి పార్టీ అధినేత(Prajashanthi Party Chief) కేఏ పాల్(KA Paul) అన్నారు. విశాఖలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖను ఏపీ రాజధానిగా ప్రకటిస్తున్నానంటూ చెప్పుకొచ్చారు.
తాను అధికారంలోకి రాగానే విశాఖను రాజధానిగా చేస్తానని హామీ ఇచ్చారు. విశాఖను ఇంటర్నేషనల్ సిటీ గా తీర్చిదిద్దుతానని కేఏ పాల్ చెప్పుకొచ్చారు. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయొద్దని సీఎం జగన్ లేఖ రాస్తే మోడీ ఎందుకు సమాధానం చెప్పలేదని ప్రశ్నించారు. అసలు స్టీల్ ప్లాంట్‌ను అమ్మడానికి మోడీ, చంద్రబాబు ఎవరని నిలదీశారు.
స్టీల్ ప్లాంట్ అమ్మడానికి వీల్లేదని తేల్చిచెప్పారు. మోడీ, జగన్ కలిసి రాష్ట్రంలోని పరిశ్రమలను ఆదానికీ అమ్మేస్తున్నారని కేఏ పాల్ ఆరోపించారు. మోడీకి ఆదానీ మంచి స్నేహితుడని చెప్పారు. తాను కోర్టులో ఎన్నికలు ఆలస్యంగా పెట్టాలని పిటిషన్ వేసినందునే ఎన్నికలు నోటిఫికేషన్ ఇప్పుడు వచ్చిందన్నారు. చంద్రబాబు ఒక్కొక్క సీటును రూ.50కోట్లకి అమ్ముకున్నాడని కేఏ పాల్ సంచలన ఆరోపణలు చేశారు.
తనను ముఖ్యమంత్రిని చేస్తే రూ.13లక్షల కోట్ల అప్పులు తీర్చేస్తానని వాగ్దానం చేశారు. అదేవిధంగా విశాఖను డ్రగ్‌ఫ్రీ సిటీగా చేస్తానన్నారు. చంద్రబాబుపై 60కేసులు ఉంటే జగన్‌పై 30 కేసులు ఉన్నాయని కేఏ పాల్ ఆరోపించారు. తనపై మాత్రం ఒక్క అవినీతి కేసు లేదని చెప్పుకొచ్చారు. చంద్రబాబును తిట్టి పవన్ కళ్యాణ్ టీడీపీలో చేరిపోయారని ఎద్దేవా చేశారు.