కేసీఆర్ చేసిన అభివృద్ధి రేవంత్ రెడ్డి (Revanth Reddy) సర్కార్‌కు కనిపించడం లేదని బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే కడియం శ్రీ హరి (kadium srihari) అన్నారు. బీఆర్‌ఎస్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం బురద జల్లే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణ నదీ జలాలపై కేంద్రం పెత్తనాన్ని బీఆర్‌ఎస్ ప్రభుత్వం గత పదేండ్లుగా అడ్డుకున్నదని ఆరోపించారు.
తెలంగాణ భవన్ నుంచి ‘చలో నల్లగొండ’ బహిరంగ సభకు బయలుదేరే ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. నూతనంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ మాత్రం కేవలం రెండు నెలల్లోనే కృష్ణ, గోదావరి నది జలాల బోర్డులకు నదుల నిర్వహణను అప్పజెప్పిందని నిప్పులు చెరిగారు. తెలంగాణ నదీ జలాలపై కేంద్రం పెత్తనాన్ని ఎట్టి పరిస్థితులలో ఒప్పుకునేది లేదని తేల్చి చెప్పారు.
ఈ రోజు ప్రారంభమైన జల ఉద్యమం మొదటి అడుగు మాత్రమేనన్నారు. భవిష్యత్తులో దీన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. తెలంగాణ రైతాంగం భవిష్యత్తును అంధకారం చేసే ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా తమ పార్టీ గళమెత్తిందని వివరించారు. బీఆర్ఎస్ బహిరంగ సభకు భయపడిన కాంగ్రెస్ ప్రభుత్వం తోకముడిచిందన్నారు. అసెంబ్లీలో అబద్ధాలను ప్రచారం చేసిందని ధ్వజమెత్తారు.
తెలంగాణ ప్రజలకు వాస్తవాలు తెలియ చెప్పాల్సిన అవసరం తమపై ఉందని అన్నారు. కృష్ణా నది కింద ఉన్న ప్రాజెక్టులు కేఆర్‌ఎంబీకి అప్పగించడం మంచిది కాదని చెప్పారు. దానివల్ల తెలంగాణ ఎడారిగా మారుతుందన్నారు. కరెంట్‌కు కూడా ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారు.