బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో అనేక వైఫల్యాలు ఉన్నాయంటూ కాంగ్రెస్ సర్కార్ రోజుకో సాక్ష్యం ఎత్తిచూపుతోంది. సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) కొన్నిసార్లు బీఆర్ఎస్ నేతల అక్రమాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కొడంగల్ సభలోనూ బీఆర్ఎస్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Station Ghanpur MLA Kadiam Srihari) ఫైర్ అయ్యారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రగతిని వైఫల్యంగా చూపడం బాధాకరమన్నారు. రేవంత్ రెడ్డి సహనం కోల్పోయి మాట్లాడుతున్నారన్నారు. రేవంత్ రెడ్డి భాషను తీవ్రంగా ఖండిస్తున్నామన్నామని కడియం శ్రీహరి అన్నారు.
సీఎం హోదాలో హుందాగా ఉంటారని అనుకున్నామని అయితే ఆయన భాష జుగుప్సాకరంగా ఉందంటూ వ్యాఖ్యానించారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో దేశానికి రోల్ మోడల్‌గా తెలంగాణ నిలిచిందని చెప్పుకొచ్చారు. మేడిగడ్డ కుంగిపోవడానికి సాంకేతిక కారణాలు ఉండొచ్చన్నారు కడియం. అంతేకానీ రాజకీయాల కోసం మేడిగడ్డను వాడుకోవద్దంటూ హితవు పలికారు.
విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోండంటూ సూచించారు. మేడిగడ్డకు ఖర్చు చేసింది రూ.3వేల కోట్లు మాత్రమేనని వెల్లడించారు. రాజకీయాల కోసం కాంగ్రెస్ రైతులను ఇబ్బందులు పెట్టడం సరికాదన్నారు. ప్రతిపక్షాలను విమర్శించడమే సీఎం రేవంత్ పనిగా పెట్టుకున్నారన్నారు. ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను ఇలా మోసం చేస్తూ ఇలాంటి మాటలు మాట్లాడతారని ఊహించలేదన్నారు.