– నిర్మాణ వైఫల్యాలు, నిర్వహణ లోపాలు
– మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలను పరిశీలించిన కేంద్ర బృందం
– బ్యారేజీల డిజైన్లను క్షేత్ర స్థాయిలోకి తీసుకువెళ్లి కొలతలు
– డిజైన్ల మేరకు నిర్మాణాలు జరగలేదనే సందేహాలు
– మేడిగడ్డ 7వ బ్లాక్ తొలగించి కొత్తది నిర్మించడమా?
– లేదా బ్యారేజీ మొత్తానికి మరమ్మతులు చేయడమా?
– నిపుణుల బృందం నివేదికపై ఉత్కంఠ
– పూర్తి స్తాయి నివేదిక 4 నెలల తర్వాతే
– మధ్యంతర రిపోర్ట్ ఇచ్చే ఛాన్స్
కాళేశ్వరం ఆనకట్టల కథేంటో తెలుసుకునే పనిలో ఉంది కేంద్రం పంపించిన కమిటీ. ఇప్పటికే మేడిగడ్డను క్షుణ్ణంగా పరిశీలించిన టీమ్.. శుక్రవారం అన్నారం, సుందిళ్ల బ్యారేజీలని సందర్శించింది. గురువారం రాత్రి రామగుండంలో బస చేసిన సభ్యులు, అక్కడి నుంచి నేరుగా అన్నారం బ్యారేజీకి వెళ్లారు. బ్యారేజీలో ఏర్పడ్డ సీపేజీలు, బుంగలు, లీకేజీల ప్రాంతాన్ని చూసి వివరాలు సేకరించారు. బ్యారేజీపై తిరిగి విస్తృత అధ్యయనం చేశారు. మధ్యాహ్నం వరకు అన్నారం బ్యారేజీ వద్దనే పరిశీలించి అక్కడి నుంచి సుందిళ్ల బ్యారేజీకి వెళ్లారు.
మొదటి రోజు మేడిగడ్డ బ్యారేజీలో 6, 7, 8 బ్లాకులు, దెబ్బతిన్న, కుంగిన ప్రాంతాలను పరిశీలించారు. బ్యారేజీ వద్ద ఆనకట్ట కుంగుబాటు ఏ మేరకు ఉందన్నది నిశితంగా గమనించారు. దిగువకు వెళ్లి, 7వ బ్లాక్‌లోని 19, 20, 21 పల్లర్ల కుంగుబాటుకు దారితీసిన కారణాలను అధ్యయనం చేశారు. బ్యారేజీకి ఏర్పడ్డ పగుళ్లనూ చూశారు. అలాగే, అన్నారం సీపేజ్ ఏర్పడిన 10 బ్లాక్‌తో పాటుగా 38, 28 పియర్లను పరిశీలించారు. దెబ్బతిన్న ప్రాంతాల్లో విస్తృతంగా పరిశోధనలు చేశారు. బుంగలు ఏర్పడగానే తీసుకున్న చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పియర్ల దగ్గర గ్రౌంటింగ్ పనులను పరిశీలించింది కమిటీ. ఎల్ అండ్ టీ ప్రతినిధుల నుంచి ఈ బ్యారేజీలకు సంబంధించిన డిజైన్లను స్వాధీనం చేసుకుని నిర్మాణాల్లో ప్రతి ఇంచును పరిశీలించింది.
స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ లో పియర్లకు బలం చేకూర్చే డయాఫ్రమ్ వాల్ పరిశీలించారు. కాళేశ్వరం అనుబంధ మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల్లో నిర్మాణ వైఫల్యాలు, నిర్వహణ లోపాలు ఉన్నట్లు నేషనల్ డ్యాంసేఫ్టీ అథారిటీ నిపుణుల బృందం అంచనాకు వచ్చింది. ఈ మేరకు బ్యారేజీల డిజైన్లను క్షేత్ర స్థాయిలోకి తీసుకువెళ్లి కొలతలు తీశారు. డిజైన్ల మేరకు నిర్మాణాలు జరగలేదనే సందేహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే.. భూసార పరీక్షలు, బ్యారేజీకి వాడిన మెటీరియల్‌ను తాము కోరిన విధంగా పరీక్షలు చేసి నివేదికలు ఇవ్వాలని నిపుణుల బృందం రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులను కోరింది.
గత రెండు రోజులుగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ ప్రతినిధి బృందం అనేక సందేహాలు, వైఫల్యాలను గమనించినట్లు తెలుస్తోంది. పోలీసుల సహాయంతో లాంగ్ విజువల్స్ ను డ్రోన్ల సహాయంతో తీసుకున్నారు. నిపుణుల బృదం పరిశీలిస్తున్నప్పుడు ఎవరినీ దగ్గరకు రానీయ కుండా సుమారు కిలో మీటరు పరిధిలోనే ఉంచారు. భారీ సాయుధ పోలీసు బలగాల పహారాలో నిపుణుల బృందం శుక్రవారం సాయంత్రం 6.30 గంటల వరకు క్షేత్రస్తాయిలోనే ఉంది. పరిశీలన అనంతరం కావల్సిన నివేదికలను అందివ్వాలని నీటిపారుదల శాఖ అధికారులను నిపుణుల బృదం కోరింది. ప్రధానంగా మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్ తొలగించి కొత్తది నిర్మించడమా? లేదా బ్యారేజీ మొత్తానికి మరమ్మతులు చేయాల్సి ఉందా అనే అంశానికి ఈ నిపుణుల బృందం సూచనలు చేయనుంది. పూర్తి స్తాయి నివేదిక నాలుగు నెలల్లో ఇవ్వనున్నట్లు నిపుణుల బృందం ప్రకటించినప్పటికీ అంతకు ముందే మేడిగడ్డ బ్యారేజీ అంశంపై మధ్యంతర నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం.