కాళేశ్వరం (Kaleswaram) ప్రాజెక్ట్ పై బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.. తెలంగాణ భవన్లో నేడు నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పై విమర్శలు గుప్పిస్తూనే ప్రాజెక్టుపై వివరణ ఇచ్చారు. కాళేశ్వరం అంటే కేవలం ఒక బ్యారేజీ కాదని 15 రిజర్వాయర్లు, 21 పంప్ హౌజులు, 203 కిలోమీటర్లు ఉన్న సొరంగాలని తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీలో మొత్తం 84 పిల్లర్లు ఉంటే అందులో 3 కుంగిపోయాయని.. మూడు పిల్లర్లు కుంగితే బ్యారేజీ మొత్తం కొట్టుకుపోయినట్లు కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ (Telangana)కు నీళ్లు ఇవ్వకుండా కాంగ్రెస్ (Congress) కన్నీళ్లు పెట్టించిందని కేటీఆర్ (KTR) ఆరోపించారు.
రాష్ట్రంలో వందల కిలో మీటర్లు గోదావరి నది ప్రవహిస్తున్నా కూడా గతంలో రాష్ట్రం ఎడారిగా ఉండేదన్నారు. ‘తలాపున పారుతోంది గోదావరి.. మన చేను, సేలక ఎడారి’ అని రాసిన పాటలు గుర్తు చేశారు.. ఇక కాంగ్రెస్ ఉమ్మడి రాష్ట్రంలో జలయజ్ఞం చేపట్టిందని.. కానీ అది జలయజ్ఞం కాదు ధనయజ్ఞం అని ఎద్దేవా చేశారు. గతంలో కేంద్రంలో, ఏపీ, మహారాష్ట్రలో అధికారంలో ఉన్న కాంగ్రెస్.. ప్రాజెక్టుల కోసం అనుమతులు తీసుకురాలేదని కేటీఆర్ విమర్శించారు.
క్రాంటాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్స్‌ల పేరుతో రూ.52 వేల కోట్లు కట్టాబెట్టారని ఆరోపించారు. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పదేళ్లు టైమ్ పాస్ చేసిందని సీరియస్ అయ్యారు. గోదావరి నీళ్లను తెలంగాణకు మళ్లీంచేందుకు కేసీఆర్ (KCR) భగీరథ ప్రయత్నం చేశారని తెలిపారు.. తమ్మిడిహట్టి వద్ద నీళ్లు లేవని, మేడిగడ్డ వద్దే నీటి లభ్యత ఎక్కువని కేంద్ర జలసంఘం చెప్పినట్లు గుర్తు చేశారు.
అందువల్లే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇక్కడ నిర్మించామని స్పష్టం చేశారు. మరోవైపు కాళేశ్వరం నిర్మాణ సమయంలో, మహారాష్ట్రతో వివాదం ఉన్నా సామరస్యంగా పరిష్కారించామని వివరించారు.. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కు మళ్లీ జీవం వచ్చిందంటే కారణం కాళేశ్వరమేనని, ఈ ప్రాజెక్టు 40 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే కామధేనువు అని పేర్కొన్నారు. అనంతరం మేడిగడ్డ, అన్నారం త్వరలో వెళ్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.