అకాలవర్షం(untimely rain) రైతులను అతలాకుతలం చేస్తోంది. రెండు, మూడు రోజులు కురుస్తున్న అకాల వర్షాలతో గ్రామీణ ప్రాంతాల్లో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ముఖ్యంగా మొక్కజొన్న, వరి, మామిడి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఈ క్రమంలో అన్నదాతల్లో ఆందోళన మొదలైంది. ప్రభుత్వం అందించే నష్టపరిహారంపైనే ఆశలు పెట్టుకుంటున్నారు.
వడగండ్ల వాన తమను నిండా ముంచిందని ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా(Kamareddy District) భిక్కనూరు మండలం(Bikkanur Mandal) అంతంపల్లి(Anthampalli) గ్రామ శివారులోని రైతులు హైవేపై మంగళవారం బైఠాయించి ఆందోళనకు దిగారు.
నాలుగు రోజుల కిందట వడగళ్ల వానతో చేతికొచ్చిన పంటలు పూర్తిగా దెబ్బతింటే, అధికారులు వచ్చి నష్టాన్ని అంచనా వేయలేదన్నారు. వ్యవసాయ శాఖ ఏడీఏ అపర్ణ, ఏవో రాధా, తహసీల్దార్ కె.శివప్రసాద్ రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు. పంట నష్టాన్ని అంచనా వేశామని, నివేదికను ప్రభుత్వానికి పంపామని చెప్పారు. అయితే రైతులు వారి మాట వినిపించుకోలేదు. అసలు అధికారులు ఏ గ్రామానికి వచ్చి పంట నష్టాన్ని అంచనా వేశారంటూ మండిపడ్డారు. మేమంటే అంత అలుసా? అంటూ ప్రశ్నించారు.
నెల కాగానే జీతం వచ్చే మీకు మా బాధలెలా అర్థమవుతాయంటూ మండిపడ్డారు. పరిహారం ప్రకటించే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని రైతులు భీష్మించారు. హైవేపై గంటన్నరకు పైగా ఆందోళన కొనసాగిస్తున్నారు. కామారెడ్డి డీఎస్పీ డి.నాగేశ్వరరావు వారికి ఎంత నచ్చజెప్పినా రైతులు వినలేదు. తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ మొండికేస్తున్నారు.
పడిపోయిన మక్కా, కర్బూజా, మామిడి వరి పంటలను రోడ్డుపైకి తెచ్చి తమ గోసను వెల్లబోసుకున్నారు. కలెక్టర్ జితేష్ రావాలని నష్టపరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. గంటన్నరకు పైగా రాస్తారోకో జరుగుతుండడంతో కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రైతులు మాత్రం ఆందోళనను ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు.