బీఆర్ఎస్ లో మొదటి నుంచి వివాదాస్పదంగా వ్యవహరిస్తున్న వ్యక్తి పాడి కౌశిక్ రెడ్డి అనే ఆరోపణలున్నాయి.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను బ్లాక్ మెయిల్ చేసి గెలిచాడనే విమర్శలు సైతం ఆయనను చుట్టుముట్టాయి. అయితే కాస్తంత నోటి దూల.. ఒంటిపోగరు ఉందనేలా ప్రవర్తిస్తున్న కౌశిక్ వార్తల్లో నిలవడం తరచుగా కనిపిస్తోంది. ప్రస్తుతం హుజురాబాద్ (Huzurabad) ఎమ్మెల్యే (MLA)గా ఉన్న ఈయనపై తాజాగా కేసు నమోదు అయ్యింది.
కొండనాలుకకి మందు వేస్తే.. ఉన్న నాలుక ఉడినట్లు.. అత్యుత్సాహంతో ఇప్పుడు పోలీసులపై చేసిన వ్యాఖ్యలతో కౌశిక్ రెడ్డి మరో కేసులో ఇరుక్కున్నారు. పార్టీ కార్యకర్తల్లో దైర్ఘ్యాన్ని నింపేందుకు ప్రయత్నించిన వాక్యాలు పోలీసుల మనోభావాలు దెబ్బతినేలా ఉండటంతో వ్యవహరం బెడిసికొట్టింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 12న కరీంనగర్‌లో బీఆర్ఎస్ (BRS) అధినేత కేసీఆర్ (KCR) పర్యటించనున్న నేపథ్యంలో.. నగరంలోని శ్వేత హోటల్‌లో ఎమ్మెల్యే ఈనెల 7న సమావేశం నిర్వహించారు.
పార్టీ శ్రేణులతో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో కౌశిక్ రెడ్డి పోలీసులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కరీంనగర్‌లో బీఆర్ఎస్ నేతలపై భూ కబ్జాలు, అక్రమణలు, అరాచకాలపై కేసులు నమోదవుతున్నాయని భావించిన ఆయన.. కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపిందుకు నోరు అదుపులో పెట్టుకోకుండా వివాదాస్పదంగా మాట్లాడారు. కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు ఏ స్థాయి అధికారులు అయినా ఖబడ్దార్ మిత్తితో సహా చెల్లిస్తామని హెచ్చరించారు.
అయితే కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పలు వార్తా పత్రికల్లో ప్రచురితమవడమే కాకుండా.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.. కాగా ఈ విషయంపై కరీంనగర్ (Karimnagar)కు చెందిన పురుషోత్తం, అశీష్ గౌడ్‌లు వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కౌశిక్ రెడ్డి (Kaushik Reddy) మాట్లాడరని, ఆయనపై కేసు నమోదు చేయాలని పిటిషన్ లో కోరారు.