కర్ణాటకలో రైతు సంఘాలు (Former Unions) , కన్నడ అనుకూల సంస్థలు శుక్రవారం రాష్ట్ర వ్యాప్త బంద్ (State Wide bandh) కు పిలుపునిచ్చాయి. తమిళనాడుకు కావేరి నీటిని విడుదల చేయడాన్ని నిరిసిస్తూ బంద్‌ను నిర్వహిస్తున్నాయి. ఇదే విషయంపై ఇటీవల బెంగళూరులో రెండు రోజుల పాటు బంద్ నిర్వహించిన కన్నడ సంఘాలు తాజాగా తమ ఉద్యమాన్ని మరింత తీవ్రం చేయాలన భావిస్తున్నాయి.
బంద్ సందర్బంగా బెంగళూరులోని టౌన్ హాల్ నుంచి ఫ్రీడమ్ పార్కు వరకు నిరసన ర్యాలీని నిర్వహించాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించాలని పలు కన్నడ సంఘాలు నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ ను పోలీసులు విధించారు.
బంద్ నేపథ్యంలో బెంగళూరులోని అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. బంద్ కు రాష్ట్రంలోని ఆటో యూనియన్స్, ఓలా, ఊబర్ క్యాబ్ డ్రైవర్స్ యూనియన్ కడా మద్దతు తెలిపింది. బంద్ కు మద్దతుగా తాము నయంద హళ్లి నుంచి ఫ్రీడమ్ పార్క్ వరకు నిరసన ర్యాలీ నిర్వహిస్తామని క్యాబ్ ఊబర్స్ అసోసియేషన్ వెల్లడించింది.
ప్రజా రవాణాకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. బ్యాంకులు, ఎమర్జెన్సీ సర్వీసులైన ఆస్పత్రులు, మెడికల్ షాపులు తెరిచే వుంటాయని అధికారులు చెప్పారు. ప్రతిపక్ష బీజేపీ, జేడీఎస్ లు కూడా ఈ బంద్ కు మద్దతు ప్రకటించాయి. ఇక తమిళనాడుకు కావేరి జలాల విడుదలపై ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కర్ణాటక రక్షణ వేదిక ఆధ్వర్యంలో బెంగళూరులో భారీ ర్యాలీ నిర్వహించారు.