Karnataka : కర్ణాటకలో అవినీతి, కమీషన్ల దందా కొనసాగుతోంది. ప్రభుత్వ పనులు, ప్రాజెక్టుల్లో 40 శాతం కమీషన్ల యవ్వారం గత బీజేపీ ప్రభుత్వ హయాంలో సాగితే.. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికీ అదే మకిలి పట్టుకుంది. కాకపోతే అప్పుడు 40 శాతమైతే ఇప్పుడు 10 నుంచి 15 శాతం.. అంతే తేడా! లెక్క మాత్రం కాస్త తగ్గినా సేమ్ సీన్ ! సీఎం సిద్దరామయ్య నేతృత్వంలోని రెండు నెలల ప్రభుత్వంలో అవినీతి గురించి బెంగళూరు లోని ప్రజా పనుల శాఖకు చెందిన కొంతమంది కాంట్రాక్టర్లు ఈ షాకింగ్ నిజాన్ని బయటపెట్టారు. రెండేళ్లకు పైగా తాము చేబట్టిన పనులకు సంబంధించి బిల్లులు ఇప్పటివరకు క్లియర్ కాలేదని బృహత్ బెంగళూరు మహానగర పాలికే కాంట్రాక్టర్ల సంఘం రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ వద్ద మొర పెట్టుకుంది.
750 మంది సభ్యులున్న ఈ సంఘం ఈ మేరకు ఓ లేఖను ఆయనకు సమర్పించింది. వ్యవసాయ శాఖ మంత్రి చెలువరాయస్వామి (Cheluvaraya Swami) తనకు ప్రతి నెలా తమ శాఖకు చెందిన జాయింట్ డైరెక్టర్ల ద్వారా 8 లక్షలను లంచంగా ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో వీరి లేఖ ప్రాధాన్యం సంతరించుకుంది. మాండ్యా జిల్లా వ్యవసాయశాఖకు చెందిన కొందరు అసిస్టెంట్ డైరెక్టర్లు గవర్నర్ కు రాసినట్టు ఉన్న లేఖ కూడా ఇదే సమయంలో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
గవర్నర్ వెంటనే చర్యలు తీసుకోకపోతే తాము తమ కుటుంబాలతో కలిసి సామూహిక ఆత్మహత్యలకు పాల్పడతామని వారు హెచ్చరించినట్టు కూడా తెలిసింది. తాజాగా.. పెండింగులో ఉన్న తమ బిల్లులను క్లియర్ చేసే విషయంలో సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసి తమకు న్యాయం చేయాలని ఈ కాంట్రాక్టర్లు గవర్నర్ ను కోరారు. ‘వివిధ అసాధారణ ప్రయోజనాల’ నిమిత్తం తమ బిల్లులను ఆపుతున్నారని , 10 నుంచి 15 శాతం కమీషన్ ఇవ్వాలని వేధిస్తున్నారని వారు ఆరోపించారు.
డిప్యూటీ సీఎం, బెంగళూరు నగర అభివృద్ధి శాఖను కూడా నిర్వహిస్తున్న డీకే. శివకుమార్ (DK. Shivakumar) తరఫున ఈ కమీషన్ ను డిమాండ్ చేస్తున్నారన్నారు. కమీషన్ చెల్లించకపోతే మీ బిల్లులు పెండింగులోనే ఉంటాయని మహానగర పాలికే లోని అధికారులు హెచ్చరిస్తున్నారని వారు పేర్కొన్నారు. అయితే శివకుమార్ ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. ఇది రాజకీయ కుట్ర అని, కాంట్రాక్టర్ల సమస్యతో తనకెలాంటి సంబంధం లేదని, ఏ బిల్లుల గురించి తనకు తెలియదన్నారు. ‘ఏ కాంట్రాక్టర్ తో కూడా నేను మాట్లాడలేదు. వీరి వెనుక ఎవరున్నారో నాకు తెలుసు… వారిని ఏమైనా చేసుకోనివ్వండి’ అని ఆయన వ్యాఖ్యానించారు.
లోగడ కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా.. ‘పే సీఎం’, ’40 శాతం సర్కార్’ అన్న ఆరోపణలతో కూడిన ప్రచారాలతో విరుచుకుపడిన కాంగ్రెస్ ఇప్పుడు తాను కూడా అవినీతికి అతీతమేమీ కాదని నిరూపించుకుంటోందా అన్న అభిప్రాయాలు తలెత్తుతున్నాయి. ఆ ప్రభుత్వంలో.. నాటి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కె.ఎస్.ఈశ్వరప్ప లంచం కోసం చేసిన వేధింపుల కారణంగా సంతోష్ పాటిల్ అనే కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకున్న ఉదంతాన్ని కొందరు గుర్తు చేస్తున్నారు.