కర్ణాటక ప్రభుత్వం(Karnataka Government) కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్ర వ్యాప్తంగా హుక్కా (Hookah) తాగడంపై నిషేధం విధించింది. ఈ మేరకు ఆరోగ్య శాఖ మంత్రి దినేశ్ గుండూరావు(Health Minister Dinesh Gundurao) ప్రకటించారు. ప్రజలు, యువత ఆరోగ్యాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు.
ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. హుక్కా తాగడం (Hookah smoking) వల్ల ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నదని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా హుక్కాను నిషేధిస్తున్నామని, భవిష్యత్ తరాలకు మెరుగైన, సురక్షితమైన ఆరోగ్యకర వాతావరణాన్ని సృష్టించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని పేర్కొన్నారు.
పొగాకు ఉత్పత్తులకు యువత బానిసలుగా మారుతుండడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో పాఠశాలలు, ఆలయాలు, మసీదులు, శిశు సంరక్షణ కేంద్రాలు, దవాఖానల చుట్టుపక్కల పొగాకు వాడకం, విక్రయాన్ని ప్రభుత్వం ఇప్పటికే నిషేధించింది.
అదేవిధంగా యువత హుక్కాబార్లకు ఆకర్షితులవుతున్నారని, ఇది వారి ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపిస్తుందని మంత్రి దినేశ్ గుండూరావు తెలిపారు. మరోవైపు, గతేడాది సెప్టెంబర్ నెలలో హుక్కా బార్లను నిషేధించిన కర్ణాటక ప్రభుత్వం, పొగాకు ఉత్పత్తుల కొనుగోలు వయసును 18 నుంచి 21 ఏళ్లకు పెంచింది.