– వంద రోజులు.. అనేక కార్యక్రమాలు
– ఇంటింటి ప్రచారానికి శ్రీకారం
– గెలుపు కోసం ఆరు గ్యారెంటీలు
– అచ్చం కర్ణాటక స్ట్రాటజీ.. తెలంగాణలో!
– అక్కడ వర్కవుట్ అయినట్టు..
– ఇక్కడ కూడా అవుతుందా?
– కాంగ్రెస్ గెలుపు బాట పడుతుందా?
తెలంగాణ (Telangana) పై గంపెడాశ పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రం ఇచ్చిన పార్టీగా ప్రమోట్ చేసుకుంటూ.. ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకునే పనిలో ఉంది. ఇప్పటికే వంద రోజుల యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేసుకుని ఇంటిటి ప్రచారానికి దిగింది. ప్రతీ ఇంటినీ, ప్రతీ వ్యక్తిని కలిసి ఇచ్చిన హామీలను.. అధికారంలోకి రావాల్సిన అవసరాన్ని వివరిస్తోంది. అయితే.. తుక్కుగూడ సభా వేదిక నుంచి ప్రకటించిన ఆరు గ్యారెంటీలు పార్టీని గెలుపు బాట పట్టిస్తాయని గట్టిగా నమ్ముతున్నారు హస్తం నేతలు. అచ్చం ఇదే స్ట్రాటజీతో కర్ణాటకలో విజయం సాధించామని.. తెలంగాణలో కూడా అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటామని ధీమాగా చెబుతున్నారు.
కర్ణాటక (Karnataka) లో కాంగ్రెస్ (Congress) కూటమిని కూల్చేసిన తీరును వివరిస్తూనే.. ఇంకోవైపు ఐదు గ్యారెంటీలను ప్రమోట్ చేయడంలో సక్సెస్ అయ్యారు హస్తం నేతలు. దాని ఫలితంగా అధికారం దక్కింది.
కర్ణాటక కాంగ్రెస్ ఐదు గ్యారెంటీలు
– గృహజ్యోతి పథకం కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్
– గృహలక్ష్మి పథకం కింద 1.5 కోట్ల గృహిణులకు నెలకు రూ.2 వేల ఆర్థిక సహాయం
– అన్న భాగ్య పథకం కింద పేద కుటుంబాలకు 10 కిలోల ఉచిత బియ్యం
– యువనిధి యోజన కింద నిరుద్యోగ పట్టభద్రులకు నెలకు రూ.3 వేలు, డిప్లొమా చదివిన వారికి నెలకు రూ.1,500 నిరుద్యోగ భృతి
– ప్రభుత్వ రవాణా వాహనాల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
కర్ణాటకలో ఈ ఐదు గ్యారెంటీలను బాగా ప్రమోట్ చేసుకుని గెలిచింది కాంగ్రెస్. ఇప్పుడు తెలంగాణలోనూ ఇదే ఫార్ములాతో ముందుకెళ్తోంది. అయితే.. ఇక్కడ అదనంగా ఇంకో గ్యారెంటీని యాడ్ చేసి.. ఆరు హామీలను ప్రకటించింది.
తెలంగాణ కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు
1. మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, రూ.500లకే గ్యాస్ సిలిండర్, రాష్ట్రమంతటా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
2. రైతు భరోసా కింద ఏటా రైతులు, కౌలు రైతులకు ఎకరానికి రూ.15,000 పెట్టుబడి సాయం, వ్యవసాయ కూలీలకు రూ.12,000 ఆర్థిక సాయం, వరి పంటకు అదనంగా రూ.500 బోనస్
3. గృహజ్యోతి పథకం కింద ఇళ్లల్లో వాడే 200 యూనిట్ల కరెంట్ ఉచితం
4. ఇందిరమ్మ ఇళ్లు, ఇళ్లు లేని పేదలకు ఇంటి స్థలం ఇవ్వడంతోపాటు నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం, తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటిస్థలం
5. యువ వికాసం కింద విద్యా భరోసా కార్డు కింద విద్యార్థులకు రూ.5 లక్షల పరిమితితో వడ్డీ రహిత ఆర్థిక సాయం. ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూళ్ల ఏర్పాటు
6. చేయూత కింద పింఛనుదారులకు నెలకు రూ.4,000. ఆరోగ్య శ్రీ కింద రూ.10 లక్షల ఇన్సూరెన్స్ సదుపాయం
మొత్తంగా ఈ ఆరు గ్యాంరెటీలతో.. అధికారం గ్యారెంటీ అనే నమ్మకంతో ఉంది కాంగ్రెస్. అందుకే, క్షణం ఆలస్యం చేయకుండా ఇంటింటి ప్రచారానికి దిగింది. నిజానికి, ఈ స్ట్రాటజీ అమలు కోసం చాలాకాలంగా కసరత్తులు చేస్తోంది. ఓవైపు అగ్ర నాయకులు రాష్ట్రానికి వస్తూ.. ఇక్కడి నేతలతో సమన్వయం చేసుకుంటూ అన్నీ ప్రిపేర్ చేశారు. అంతర్గతంగా హైకమాండ్ నుంచి ఓ వ్యవస్థ పార్టీ వ్యవహారాలను నడిపిస్తోంది. రాష్ట్రానికి గత రెండు నెలల్లో ఢిల్లీ నుంచి 30 మంది దూతలు వచ్చారు. రాష్ట్ర నాయకులకు సమన్వయం చేసుకుంటూ అన్నీ చూసుకుంటున్నారు. జిల్లాల వారీగా పర్యవేక్షిస్తున్నారు.
జిల్లాల్లో నిర్మాణం, పార్టీ బలోపేతం, అంతర్గత విభేదాలు తదితర అంశాలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ఏఐసీసీ కీలక నేతలు కృషి చేస్తున్నారు. పార్టీ దృష్టికి వస్తున్న సమస్యలను హైకమాండ్ కు నివేదిస్తున్నారు. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఒక ఇంచార్జితో పాటు వారందరికీ కన్వీనర్ గా దీపదాస్ మున్షీని, కో కన్వీనర్ గా మీనాక్షి నటరాజన్ ను పార్టీ నియమించింది. ప్రజల్లోకి మరింతగా చొచ్చుకుపోయేందుకు కార్యాచరణ రూపొందించింది. కర్నాటక ఎన్నికల తరహాలోనే టీపీసీసీకి మార్గనిర్దేశం చేసేందుకు అధిష్టానం ఇక్కడే తిష్ట వేసింది. ప్రతి సమావేశంలోనూ పాల్గొని అగ్రనేతలు దిశానిర్దేశం చేస్తున్నారు. క్షేత్రస్థాయి పర్యవేక్షణలోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారు. పరిస్థితులను చక్కదిద్దుతున్నారు. అభిప్రాయ భేదాలు బహిర్గతం కాకుండా కట్టుదిట్టం చేస్తున్నారు. అచ్చం కర్ణాటకలో మాదిరిగా నేతలను సమన్వయం చేసుకుంటూ.. కోవర్టులను సైతం ఓ తోవకు తెచ్చినట్టు పార్టీ వర్గాలు అంటున్నాయి. రానున్న రోజుల్లో ఆరు గ్యారెంటీలను జనంలోకి తీసుకెళ్లి కర్ణాటకలో మాదిరిగానే అధికారం దక్కించుకుంటామని ధీమాగా చెబుతున్నాయి.