బంజారాహిల్స్(Banjarahills)లోని టీడీపీ(TDP) రాష్ట్ర కార్యాలయంలోకి తాను వెళ్లకుండా అడ్డుకొని దాడికి పాల్పడ్డారంటూ గుడిమల్కాపూర్‌కు చెందిన టీడీపీ గోషామహల్(Goshamahal) సమన్వయకర్త డాక్టర్ ఏఎస్.రావు(Dr. A.S.Rao) బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు టీటీడీపీ మాజీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ (Kasani Gnaneshwar)పై పోలీసులు కేసు నమోదు చేశారు.
గతనెల 29న పార్టీ కార్యాలయం నుంచి సమావేశానికి హాజరు కావాలంటూ ఫోన్‌లో తెలపడంతో తాను అక్కడకు వెళ్లానని తెలిపారు. అక్కడ పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, సభ్యులు ప్రకాశ్ ముదిరాజ్, బిక్షపతి ముదిరాజ్, రవీంద్రాచారి, బంటు వెంకటేశం, ఐలయ్యయాదవ్, ప్రశాంత్ యాదవ్ తదితరులు తనపై దాడి చేశారని, కుడికంటిపై గాయమైందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
అక్టోబర్ 29న పార్టీ కార్యాలయానికి వచ్చిన డాక్టర్ ఏ.ఎస్. రావు అమర్యాదగా ప్రవర్తిస్తూ హల్‌చల్ చేశారంటూ గోషామహల్ ఇన్‌చార్జి ప్రశాంతాదవ్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏఎస్. రావును గతంలోనే పార్టీ నుంచి సస్పెండ్ చేశామన్నారు. పరస్పర ఫిర్యాదులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదిలా ఉండగా, తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవికి కాసాని జ్ఞానేశ్ సోమవారం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉండాలని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నిర్ణయించిన నేపథ్యంలో మనస్తాపంతో రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఇంకా ఆ పార్టీ అధ్యక్ష పదవిని ఎవరు చేపడతారు? జైలు నుంచి మధ్యంతర బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత తెలంగాణ రాజకీయాలపై చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.