దేశ భద్రతకు ముప్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న ముగ్గురు ముష్కరులను జమ్ముకశ్మీర్ రాజధాని శ్రీనగర్ లో పోలీసులు అరెస్టు చేశారు. పట్టుబడ్డ ఉగ్రవాదులు లష్కరే తొయిబా (LeT) అనుబంధ సంస్థ అయిన రెసిస్టాన్స్ ఫ్రంట్‌కు(TRF) చెందిన వారుగా గుర్తించారు.
శ్రీనగర్ పట్టణంలో ఉగ్రవాద కార్యక్రలాపాలను మరింత విస్తృతం చేయడానికి వారు కుట్రపట్టారని పోలీసులు వివరించారు. పట్టుబడ్డ దుండగుల నుంచి మూడు హాండ్ గ్రనేడ్లు, పది తుపాకీలు, 25 ఏకే-47 రౌండ్లు, ఆయుధ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
విచారణ సందర్భంగా వారిని బారాముల్లాకు చెందిన ఇమ్రాన్ అహ్మద్ నాజర్, శ్రీనగర్‌కు చెందిన వసీమ్ అహ్మద్ మట్టా, బిజ్బేహార్ వాసి అయిన వకీల్ అహ్మద్ భట్‌గా గుర్తించారు. విశ్వసనీయ సమాచారం మేరకు హన్నిబాల్ నటిపోరా ప్రాంతంలో వాహనాల తనిఖీలు నిర్వహించామని, ఈ సందర్భంగా ముగ్గురు ఉగ్రవాదులు పట్టుబడ్డారని శ్రీనగర్ పోలీసులు తెలిపారు.
వకీల్ అహ్మద్ గతంలో ఇస్లామిక్ స్టేట్ జమ్ము అండ్ కశ్మీర్ (ISJK) ఉగ్రసంస్థలో క్రియాశీలకంగా వ్యవహరించాడని, రెండేండ్లపాటు జైలుకు కూడా వెళ్లివచ్చాడని తెలిపారు.వారిపై ఆయుధాలు, చట్టవ్యతిరేక కార్యకలాల చట్టం కింద కేసులు నమోదుచేశామని, దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.