మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar)పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి(BRS MLA Koushik Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. పొన్నం ప్రభాకర్ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారని, ఆయనను చూస్తే ఆవేశం స్టార్ అని పిలవాలనిపిస్తోందన్నారు.
ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ కు సంబంధించిన ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఆర్డీవోకు ఫోన్ చేసిన మంత్రి పొన్నం.. కల్యాణ లక్ష్మి చెక్కులు కౌశిక్ రెడ్డికి ఇవ్వొద్దని ఆదేశించారు. దానికి సంబంధించిన ఆడియోను ఆ ఆర్డీవో కౌశిక్ రెడ్డికి ఇచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే అధికార కార్యక్రమంలో భాగస్వామ్యం చేయొద్దని ఎలా అంటారని కౌశిక్‌రెడ్డి ప్రశ్నించారు. ఆర్డీవోకి ఫోన్ చేసి బెదిరిస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయమై సీఎస్‌కు ఫిర్యాదు చేశామన్నారు. మంత్రి పొన్నం ప్రమాణానికి భిన్నంగా ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. ఆయనను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఇలాంటి పనులు చేస్తేనే కరీంనగర్ ప్రజలు తన్ని తరిమి కొట్టాడితే ఎక్కడికో పారిపోయాడని విమర్శించారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలకు తోడు ఏడో గ్యారంటీ ఈ మంత్రి ఆవేశమని ఎద్దేవా చేశారు. అధికారులు ప్రొటోకాల్ ఉల్లంఘన చేస్తే ఇబ్బందులు పడతారన్నారు. మంత్రి మాటలు వింటే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్లే అవుతుందని కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల కోడ్ వేళ కమలాపూర్‌లో కల్యాణ లక్ష్మి చెక్కులు పంపారని, మరి.. తులం బంగారం ఏదని ప్రశ్నించారు. పోలీసు అలవెన్స్‌లు, పీఆర్సీలు ములుగులో సీతక్క ఇచ్చారని, కరీంనగర్లో ఎందుకివ్వడంలేదన్నారు. కరీంనగర్లో లక్ష ఓట్ల మెజార్టీతో ఎంపీ సీట్ గెలుస్తామని కౌశిక్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.