తెలంగాణ (Telangana) లో రైతు బంధు పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది ప్రభుత్వం. ప్రస్తుతం ఎన్నికల కోడ్ నేపథ్యంలో అన్ని పథకాలకు బ్రేక్ పడింది. అయితే.. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే రైతు బంధు కింద ఇచ్చే డబ్బులను పెంచుతామని.. క్రమక్రమంగా రూ.16 వేలు చేస్తామని బీఆర్ఎస్ (BRS) ప్రకటించింది. ఈ మేరకు మేనిఫెస్టోలో కూడా పొందుపరిచింది. ఈ క్రమంలోనే రైతు బంధు హామీని జనంలోకి తీసుకెళ్తున్నారు గులాబీ నేతలు.
రైతు బంధు గురించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (Kavitha) ట్విట్టర్ (ఎక్స్)లో ప్రత్యేక పోస్ట్ పెట్టారు. స్వాతంత్ర్య భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా రైతులకు పంట పెట్టుబడి ఇచ్చింది తామేనన్నారు. ఇది కేసీఆర్ (KCR) మానస పుత్రిక అని తెలిపారు. ఐక్యరాజ్యసమితి సైతం రైతు బంధు కార్యక్రమాన్ని అభినందించిందని చెప్పారు. ఎకరానికి 8 వేలతో మొదలై, 10 వేలకు పెంచుకున్నామన్న కవిత.. వచ్చే ఏడాది నుండి ఈ సాయాన్ని రూ.12 వేల పెంచుతామని తెలిపారు.
రానున్న రోజుల్లో ప్రతీ ఏటా పెంచుతూ రూ.16 వేలు అందిస్తామని బీఆర్ఎస్ మేనిఫెస్టోలో కేసీఆర్ ప్రకటించడం చారిత్రాత్మక నిర్ణయమని తెలిపారు. రైతుల జీవితాల్లో వెలుగులు నింపి, తెలంగాణ వ్యవసాయ రంగ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చిన కేసీఆర్ కి అన్ని జిల్లాల్లో అన్నదాతలు మద్దతు పలకాలన్నారు. రానున్న ఎన్నికల్లో తమకు రైతుల ఆశీర్వాదం ఉండాలని కోరారు.