తెలంగాణ (Telangana) రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటి నుంచి పెద్దగా ప్రజల్లోకి వెళ్లని కేసీఆర్.. తాజాగా జిల్లాల పర్యటన చేపట్టారు.. ఇందులో భాగంగా జనగామ, సూర్యాపేట (Suryapet)లోని వివిధ మండలాల్లో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు.. కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం విధానాలపై మండిపడ్డారు.. ప్రభుత్వానికి రాజకీయాలు చేయడానికి తీరిక ఉంది కానీ రైతు బంధు వేయడానికి తీరిక లేదా అని ఫైర్ అయ్యారు.
రాష్ట్రంలో ప్రభుత్వం కొత్తగా ఏర్పడ్డదని.. కుదురుకోవాలంటే సెట్ కావాలని కాస్త సమయమిచ్చినట్లు తెలిపారు. ఇప్పటికీ నాలుగు నెలలైంది కాబట్టి ప్రశ్నిస్తున్నామని తెలిపారు. రాజకీయాలు చేయడానికి సమయం ఉంది కానీ.. ప్రజల సమస్యలు పట్టించుకోరా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో నెలకొన్న నీటి, విద్యుత్ సమస్యకు కారణమెవరని మండిపడ్డారు.. దేశంలోనే నెంబర్ 1గా ఉన్న తెలంగాణ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే దిగజార్చిందని కేసీఆర్ (KCR) అన్నారు..
అభివృద్ధి చెందిన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఎందుకీ అసమర్థత అని ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్రంలో ఏడేళ్లుగా అద్భుతంగా నడిచిన పవర్ సిస్టం ప్రస్తుతం ఎందుకు విఫలం అయ్యిందో తెలపాలన్నారు.. దీనికి బాధ్యులు ఎవరని ప్రశ్నించారు.. మిషన్ భగీరథ పథకంలో సమస్య ఎందుకు వచ్చిందో వివరించాలని కోరారు.. రాష్ట్రంలో ఏర్పడ్డ నీటి సమస్యకు కారణమెవరని గులాబీ బాస్ ప్రశ్నించారు.
మళ్లీ నీళ్ల ట్యాంకర్లు తెచ్చుకునే పరిస్థితి తెలంగాణలో రావడం దురదృష్టకరం అని మండిపడ్డారు.. రాష్ట్రాన్ని 100 రోజుల్లో అస్తవ్యస్థం చేశారని విమర్శించారు. మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ స్థాయికి ఎదిగిందని, ఇప్పుడు సాగునీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని ఫైర్ అయ్యారు.. చాలా చోట్ల రైతులు కన్నీరుమున్నీరవుతున్నారని పేర్కొన్నారు..
పెట్టుబడులు పెట్టి నష్టపోయినం, మాకు తగిన పరిహారం ఇప్పించాలని వేడుకొంటునట్లు తెలిపారు.. ప్రభుత్వం ముందుగా నీళ్లు ఇస్తమని చెప్పింది. అందుకే తాము పంటలు వేశామని, కానీ తీరా పంటలు వేసిన తర్వాత నీళ్లు ఇవ్వకపోవడంతో నష్టపోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన చెందుతున్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు.. ‘రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటదనే ఉద్దేశంతో గత ప్రభుత్వం కొన్ని స్పష్టమైన విధానాలు తీసుకుని చర్యలు చేపట్టిందని తెలిపారు..
రైతులకు అనేక పద్ధతుల ద్వారా నీరు సరఫరా చేయడం ఒకటని.. రైతుబంధు కార్యక్రమం ద్వారా రైతులకు సమయానికి పెట్టుబడి సాయం ఇవ్వడం రెండో పడ్డతని.. మూడోది సాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ అందజేయడం, నాలుగోది ప్రభుత్వమే రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పంటలను కొనుగోలు చేయడం, ఐదోది రైతులకు అనుకోనిది ఏదైనా సంభవిస్తే రైతుబీమా అందజేయడం. ఈ విధంగా అద్భుతమైన విధానాలను బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిందని కేసీఆర్ వివరించారు..