అభ్యర్థుల ప్రకటనతో ఎన్నికల యుద్ధాన్ని మొదలుపెట్టారు సీఎం కేసీఆర్ (CM KCR). ఈ క్రమంలోనే జిల్లాల బాట పట్టారు. ఇప్పటికే సూర్యాపేట టూర్ ముగించిన సీఎం.. రేపు మెదక్ (Medak) పర్యటనకు వెళ్తున్నారు. ఆ తర్వాత జనగామ (Jangaon) జిల్లాకు వెళ్లనున్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో వరుస పర్యటనలతో బిజీగా ఉంటూ.. పార్టీ నేతలు, కార్యకర్తల్లో జోష్ నింపాలని కేసీఆర్ ఫిక్స్ అయ్యారు.
మెదక్ టూర్ లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్, పోలీస్ కార్యలయం, సమీకృత కలెక్టరేట్ కార్యలయాన్ని సీఎం ప్రారంభించనున్నారు. ఇదే వేదికపై వికలాంగుల ఆసరా పెన్షన్ పెంపు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. సీఎం టూర్ కు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి హరీష్ రావు (Harish Rao) చూసుకుంటున్నారు. మంగళవారం ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేనివిదంగా బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వెల్లడించారు.
వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో పదికి పది స్థానాలు గెలిచి సీఎం కేసీఆర్ కు గిఫ్ట్ గా ఇస్తామని తెలిపారు హరీష్. తెలంగాణలో బీజేపీకి క్యాడర్ లేదని, కాంగ్రెస్ కు క్యాండిడేట్లు లేరని విమర్శించారు. అంతేకాదు, కాంగ్రెస్ లో టికెట్లు అమ్ముకుంటున్నారంటూ ఎద్దేవ చేశారు. కేసీఆర్ వ్యూహాన్ని ఎవరూ ఉహించలేదని, అభ్యర్థుల ప్రకటనతో విపక్షాలు ఆగమైపోయాయని విమర్శించారు. గ్లోబల్స్ ప్రచారంతో ప్రతిపక్షాలు గెలువాలని చూస్తున్నాయన్న హరీష్.. బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఇక, సెప్టెంబర్ 4న జనగామ జిల్లాకు వెళ్లనున్నారు కేసీఆర్. పాలకుర్తి నియోజకవర్గంలోని వల్మిడి రామాలయ ప్రతిష్టాపన, పాలకుర్తి సోమనాథుని మ్యూజియంను ప్రారంభించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ తో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao) సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆలయ అభివృద్ధి, పాలకుర్తి టూరిజం పనులను మంత్రి పరిశీలించారు. పాలకుర్తిలో 11 అడుగుల భారీ సోమనాథుని రాతి విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు ఎర్రబెల్లి తెలిపారు.