– పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అంతా విధ్వంసమే
– తెలంగాణను అంతా ఖాళీ చేసి పోయింది
– లంకె బిందెలు ఉన్నాయని భావిస్తే..
– ఖాళీ కుండలు కనిపించాయి
– కేసీఆర్ అంతా ఊడ్చి పెట్టి పోయారు
– 22 ల్యాండ్ క్రూయిజర్లు కొని దాచారు
– దీని నుంచి తేరుకొని ముందుకు సాగుతాం
– అందుకే, కేంద్రం వద్దకు వెళ్లాం
– తెలంగాణకు సంబంధించిన నిధులు ఎక్కడున్నా వదలం
– ప్రజా వాణికి వచ్చిన మహిళకు కేటీఆర్ లక్ష ఇచ్చారు
– లక్ష కోట్ల నుంచి లక్ష ఇస్తే తప్పేం లేదు
– ప్రజా పాలన దరఖాస్తు పోస్టర్ విడుదల
– కేసీఆర్ పై విరుచుకుపడ్డ సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఫ్యామిలీ రాష్ట్రంలో మొత్తం ఊడ్చుకు పోయిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ సర్కార్ వచ్చే సమయానికి ఖాళీ కుండలే మిగిలాయని అన్నారు. తాము లంకె బిందెలు అని వస్తే, ఖాళీ గిన్నెలు కనిపిస్తున్నాయని ఎద్దేవ చేశారు. ఇప్పుడు అంతా సెట్ రైట్ చేయాల్సిన పరిస్థితి నెలకొందని రేవంత్ రెడ్డి అన్నారు.
ప్రజా పాలన దరఖాస్తు పోస్టర్ ను బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో రైతు బంధు డిసెంబర్ 20 నుంచి మార్చి 30 వరకు విడతల వారీగా డబ్బులు జమ చేస్తూ వచ్చారని తెలిపారు. అలాంటిది ఇప్పుడు ఎందుకు గాయ్ గాయ్ చేస్తున్నారంటూ కేటీఆర్, హరీష్ లపై ఫైర్ అయ్యారు. అర్హులైన ప్రతి రైతుకు రైతు బంధు పథకం డబ్బులు జమ అవుతాయని స్పష్టం చేశారు.
ప్రజావాణి వందకు వంద శాతం పూర్తి అవుతుందన్నారు. సైనిక్ స్కూల్ ఎందుకు ఆగిపోయిందో బీఆర్ఎస్ నేతలే సమాధానం చెప్పాలని.. 22 ల్యాండ్ క్రూయిజర్లను కేసీఆర్ కొన్నారని, వాటిని విజయవాడలో దాచి పెట్టారని ఆరోపించారు. మూడవ సారి సీఎం పదవి చేపట్టిన తర్వాత వాటిని ఉపయోగించాలని అనుకున్నారని చెప్పారు. ఒక్కో ల్యాండ్ క్రూయిజర్ ధర రూ.3 కోట్లు ఉంటుందన్నారు.
ప్రజావాణికి వచ్చిన మహిళకు కేటీఆర్ సహకారం అందించడం చాలా సంతోషకరమని.. లక్ష కోట్ల దోపిడీలో లక్ష రూపాయల సహాయం చేసేలా చేశామని సెటైర్లు వేశారు. త్వరలో మరిన్ని డబ్బులను కక్కించే పరిస్థితి తీసుకువస్తామన్నారు. అసెంబ్లీలో కేవలం బావ బామర్ధుల ఆరాటమే కనిపించిందని.. తాము వాస్తవాలు చెప్పామని పేర్కొన్నారు.
ఇక టీఎస్పీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేస్తామని వివరించారు రేవంత్. 2 లక్షల ఉద్యోగాలను కచ్చితంగా భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగ నియామకాలు జరగాలంటే టీఎస్పీఎస్సీకి చైర్మన్ ఉండాలన్నారు. సభ్యుల రాజీనామాపై గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ త్వరలో నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.