మాజీ సీఎం కేసీఆర్ (KCR) ఆరోగ్య పరిస్థితిపై యశోద వైద్యులు అప్డేట్ ఇచ్చారు. హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. సీటీ స్కాన్ నిర్వహించగా.. ఎడమ తుంటి ఎముక విరిగినట్లు గుర్తించినట్టు తెలిపారు. ఎడమ తుంటిని మార్పిడి చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. సర్జరీ తర్వాత కేసీఆర్ కోలుకోవడానికి 6-8 వారాల సమయం పడుతుందని వెల్లడించారు.
ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు యశోద హాస్పిటల్ వైద్యులు. బాత్రూమ్ లో జారి పడటం వల్ల ఆయనకు గాయమైనట్లు తెలిపారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్ అధినేత ఆరోగ్య పరిస్థితిని ఆస్పత్రిలోని వివిధ విభాగాల వైద్యులు పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు.
ఇటు, కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీని ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు యశోద ఆసుపత్రికి వెళ్లిన ఆయన.. వైద్యులతో మాట్లాడి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. అనంతరం రేవంత్ రెడ్డిని కలిసి వివరించారు. కేసీఆర్ కు మెరుగైన వైద్య చికిత్స అందించాలని సీఎం అధికారులకు సూచించారు.
గురువారం అర్ధరాత్రి దాటాక కేసీఆర్ తన ఫాంహౌస్ లో జారి పడిపోయారు. ఎడమ కాలుకు రెండు చోట్ల తుంటి గాయమైందని వైద్యులు చెప్పారు. దీంతో సోమాజిగూడలోని యశోదకు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. కేసీఆర్ ను యశోదకు తరలించే సమయంలో అధికారులు అంబులెన్స్ కు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు.