బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR)ను నమ్మిన వాళ్లే నట్టేట ముంచారు. ఇంతకాలం పార్టీలో కీలక స్థానాల్లో కొనసాగినవారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, నామినేటేడ్ పదవులు అనుభవించిన వారు సైతం గులాబీ బాస్‌ను ఒంటరిని చేసి పక్క పార్టీల్లోకి వెళ్తున్నారు. పదేళ్లు కేసీఆర్ సీఎంగా ఉన్నంతకాలం పార్టీలో, రాష్ట్రంలోనూ ఆయన మాటకు ఎదురులేదు. ఎవరూ ఎదురు చెప్పేవారు కూడా కాదు. ఆయన మాటే శాసనంలా శిరసా వహించేవారు.
ఎందుకంటే రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా కేసీఆర్ చాణక్యుడిలా వ్యవహరించి పార్టీని గెలిపించేవారు.అందుకే ఇంతకాలం ఆయన వెంట ఉన్న నేతలంతా ఎన్నికల్లో ఓడిపోయి కేసీఆర్ అధికారానికి దూరం కాగానే ఒక్కొక్కరుగా పార్టీనీ వీడుతున్నారు. అధికారమే లేనప్పుడు కేసీఆర్ ఉంటే ఎంత లేకపోతే ఎంత? ఆయన చెప్పే నీతి సుక్తులు ఎవరు వింటారు? అన్నట్లు ప్రవర్తిస్తున్నారు.
రాజకీయాల్లో అధికారం అనేది పులి మీద స్వారీ చేయడం లాంటిది. ఒక్కసారి అధికారం కోల్పోతే పులి నోటికి చిక్కినట్లే.. ఇప్పుడు కేసీఆర్ కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. అధికారం ఉన్నప్పుడు ఏకంగా ప్రధాని మోడీనే ‘నీ అంతు చూస్తా’ అన్న కేసీఆర్..ఇప్పుడు సొంత పార్టీ నేతలు చేసిన నమ్మకద్రోహనికి నోరుకూడా మెదపని పరిస్థితుల్లో ఉన్నారు. కాలం కలిసి రాకపోతే ఎవరైనా అంతే అని కేసీఆర్‌కు ఇప్పుడు బాగా అర్థం అయ్యి ఉంటుందని మరికొందరు సెటైర్లు వేస్తున్నారు.
ఒకప్పుడు కేసీఆర్ ప్రెస్‌మీట్ పెడితే ప్రతిపక్ష నేతలను ఓ ఆట ఆడుకునేవారు. అసెంబ్లీలోనూ గర్జించేవారు. కానీ ఇప్పుడు అసెంబ్లీకి రావడం లేదు. మీడియాకు మొహం చూపించడం లేదు. నా బలం, నా బలగం అనుకుని ఇన్నిరోజులు విర్రవీగారు.అధికారం చేజారగానే నా అనుకునే వాళ్లంతా నట్టేట ముంచారు. ఒకప్పుడు ఉద్యమకారులను కాదని, పక్క పార్టీల నుంచి వచ్చిన వారికి, ఆర్థిక స్థోమత ఉన్నవారికే టికెట్లు ఇచ్చారు. ఉన్నత పదవులు కట్టబెట్టారు. గత ప్రభుత్వంలో విచ్చల విడిగా అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు. ఇప్పుడు వాటిని కాపాడుకోవడానికి అధికారపార్టీలోకి వెళ్లిపోతున్నారు. ఏకంగా నీడ నిచ్చిన చెట్టునే నరికేందుకు సిద్ధమయ్యారు.ప్రస్తుత పరిణామాలతో కేసీఆర్ దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు.
తన కుడిభుజం అనుకున్న కేకే.. స్టేషన్ ఘనపూర్‌లో సిట్టింగును కాదని కడియంకు టికెట్ ఇస్తే.. ఇపుడు ఆయన కూడా హ్యాండిచ్చారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పార్టీలోని కీలక నేతలంతా త్వరలోనే పార్టీ మారనున్నట్లు తెలుస్తోంది.రానున్న రోజుల్లో కేసీఆర్ పార్టీని బలోపేతం చేస్తారా? లేక రాజకీయ సన్యాసం తీసుకుంటారా? అని పలువురు నేతలు ప్రశ్నిస్తున్నారు.