అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెలువడిన రోజు నుంచి బీఆర్ఎస్ (BRS) అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్‌లో ఉంటున్నారు. గత నాలుగు రోజులుగా ఆయన ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యారు. తాజాగా కేసీఆర్ ను కలిసేందుకు సిద్దిపేట జిల్లా చింతమడక గ్రామస్తులు ఫౌంహౌస్‌కు వచ్చారు.
కేసీఆర్ ను కలిసేందుకు చింత మడక నుంచి గ్రామస్తులు తొమ్మిది బస్సుల్లో బయలు దేరి వచ్చారు. ఈ క్రమంలో ఫామ్ హౌస్ పోలీసు చెక్ పోస్టు వద్ద బస్సులను పోలీసులు నిలిపి వేశారు. అనుమతి ఉందా అని అడిగి తెలుసుకున్నారు. అనుమతి లేనిదే లోపనికి అనుమతించబోమని పోలీసులు తేల్చి చెప్పారు.
ఇది ఇలా వుంటే కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇటీవల కేసీఆర్‌ని కలిశారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణ గురించి కేసీఆర్ తో ఎమ్మెల్యేలు చర్చించినట్టు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి గల కారణాలపై విశ్లేషణ్ చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పై ప్రజల్లో ఎందుకంత వ్యతిరేకత వచ్చిందనే దానిపై చర్చించినట్టు సమాచారం.
కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు దారి తీసిన పరిణామాలు, ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ఎలా అమలు చేస్తుంది. అసలు హామీల అమలు సాధ్యమేనా అనే అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. ఒక వేళ హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలం అయితే ప్రజాక్షేత్రంలో ఎలా పోరాటం చేయాలనే అంశంపై వారితో మాట్లాడినట్టు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి.