రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పరిస్థితి ఎడారిలో ఒంటరి పక్షిలా మారింది అనే టాక్ వినిపిస్తుంది. వరుసగా ఆ పార్టీ నేతలు జంప్ అవుతుండటం.. గులాబీ బాస్ ను కలవరపెడుతుందని తెలుస్తోంది. ఒకప్పుడు ఆయనకు ఎదురు చెప్పే వారు లేరు. కానీ నేడు ఇందుకు విరుద్దంగా మారింది. అయితే దీనికంతటికి కారణం వాస్తు అని నమ్మిన కేసీఆర్.. తన వాస్తు గురించి ఆలోచించకుండా.. బీఆర్ఎస్ భవన్ వాస్తుపై ప్రత్యేక దృష్టి సారించారని తెలుస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కారణం వాయువ్య దిశలోని గేటు నుంచి రాకపోకలు సాగించడమే అని తెలిపిన వాస్తు పండితుల సూచనతో భవన్ లో మార్పులు , చేర్పులకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తుంది. ఏ క్రమంలో రాకపోకలు ఈశాన్యం నుంచి సాగేలా కొత్తగా మార్పులు చేయాలని కార్యాలయ సిబ్బందికి కేసీఆర్ నుంచి ఆదేశాలు వెళ్లడంతో మార్పులు చేస్తున్నారు. హైదరాబాద్ (Hyderabad) బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12లో ఉన్న బీఆర్ఎస్ భవన్ తూర్పు అభిముఖంగా ఉంది.
అయితే వాయువ్యం నుంచి ప్రవేశ ద్వారం ఉండటం సరైంది కాదని , ఈశాన్యం నుంచి ఉండాలని పండితులు వివరించినట్లు తెలుస్తోంది. వాస్తు ప్రకారం మార్పులు చేశాకే కేసీఆర్ (KCR), తెలంగాణ (Telangana) భవన్ కు వెళ్తారని పార్టీ వర్గాల సమాచారం. కాగా పార్టీ తీవ్ర సంక్షోభంలోకి వెళ్తున్న సమయంలో ఈ మార్పులు మంచి ఫలితాలను ఇస్తాయని ఆయన భావిస్తున్నట్లు టాక్..
అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు చూపించేలా వాస్తుమార్పులు దోహదం చేస్తాయనే నమ్మకంతో కేసీఆర్ ఉన్నట్లు చర్చించుకొంటున్నారు. అదీగాక పార్టీ కార్యాలయంలో అవసరమైతే ఇంకొన్ని మార్పులు చేసే అవకాశం కూడా ఉందని ముచ్చటించుకొంటున్నారు. అయితే వాస్తు మార్పు జరిగితే తలరాతలు మారుతాయా? అని ఆ పార్టీ నేతలు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే.. గతంలో ఇక్కడి నుంచి రాజకీయ కార్యకలాపాలు నిర్వహించారు.
రెండుసార్లు బీఆర్ఎస్ (BRS) అధికారంలోకి సైతం వచ్చింది. కానీ ఇప్పుడు అధికారం కోల్పోగానే వాస్తు దోషం అంటూ హడావుడి చేయడం చూసి నేతలు విస్తుపోతున్నారు. అలాగైతే చేసి యాగాలు కూడా ప్రస్తుతం ఫలితం ఇవ్వలేదు కదా అని ప్రశ్నించుకొంటున్నారు.. అసలు లోపం మనుషులలో పెట్టుకొని వాస్తును సరిచేస్తే అధికారం దక్కుతుందా? అనే చర్చలు పార్టీనేతల్లో మొదలైనట్లు తెలుస్తోంది.