– బీఆర్ఎస్ హ్యాట్రిక్ పక్కా
– ఒకప్పుడు తెలంగాణ ఎలా ఉండేది?
– ఇప్పుడు రాష్ట్ర ఏ తీరుగా ఉంది?
– జనం ఆలోచన చేయాలి
– కాంగ్రెస్ గెలిస్తే మళ్లీ కష్టాలే
– ధరణి ఉంటేనే రైతు బంధు, రైతు బీమా
– కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ దళారులదే రాజ్యం
– పాలకుర్తి, హాలియా, ఇబ్రహీంపట్నంలో కేసీఆర్ సభలు
బీఆర్ఎస్ (BRS) హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్ (CM KCR). ఎన్నికల ప్రచారంలో భాగంగా పాలకుర్తి, హాలియా, ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలు జరిగాయి. వీటిలో పాల్గొని ప్రసంగించారు సీఎం. ఎన్నికలు అనగానే ఎందరో వస్తున్నారు.. ఏవేవో మాట్లాడుతున్నారని ఆగమాగం కావొద్దని ప్రజలకు సూచించారు. ఓటు వేసేముందు అన్నీ ఆలోచించి వేయాలని చెప్పారు. మంది మాటలు విని ఆగమైతే ఐదేళ్లపాటు కష్టాల పాలవుతారని అన్నారు. నిజానిజాలు గమనించి ఓటు వేయాలని కోరారు.
బీఆర్ఎస్ పుట్టింది తెలంగాణ కోసమని, తెలంగాణ ప్రజల కోసమేనని కేసీఆర్ తెలిపారు. మళ్లీ అధికారంలోకి రాగానే రైతుబంధు రూ.16 వేలు ఇస్తామని చెప్పారు. కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ ఎలా ఉందో.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పాలన ఎలా ఉందో ఆలోచించాలని పేర్కొన్నారు. 50 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉండే ఏం చేసిందో ప్రజలకు తెలుసన్నారు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ గెలిస్తే రైతుబంధు మాయమవుతుందని.. 3 గంటల కరెంట్ చాలని రేవంత్ రెడ్డి (Revanth Reddy) అంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ గెలిస్తే 24 గంటల కరెంట్ ఉంటుందా? అని ప్రశ్నించారు.
‘‘నాకన్న దొడ్డుగా, ఎత్తుగా ఉన్నవారు ముఖ్యమంత్రులు అయ్యారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే సరిపోదు. కనీసం మంచినీళ్లు ఎందుకు ఇవ్వలేదు. కృష్ణా, గోదావరి నదుల మధ్య ఉన్న ఈ ప్రాంతానికి నీళ్లు ఇచ్చిన పాపాన పోలేదు. లంబాడీ బిడ్డలు మా తండాలో మా రాజ్యం కావాలంటే పట్టించుకోలేదు. పాలకుర్తి నియోజకవర్గంలో 49 తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేశాం. అదే విధంగా గిరిజన రిజర్వేషన్లు 10 శాతం పెంచుకున్నాం. దళితబంధు మాదిరిగానే గిరిజన బిడ్డలు కూడా భూమి, ఉద్యోగం లేకుండా ఉంటే వారికి కూడా గిరిజన బంధు ఇస్తామని చెప్పాం. తప్పకుండా అమలు చేస్తాం. ఈ దేశంలో ఏ ప్రధాని అయినా, ముఖ్యమంత్రి అయినా, ఏ పార్టీ అయినా దళితుల గురించి ఆలోచించారా? ఓటు బ్యాంకుగా వాడుకున్నారు. కానీ, మేము దళితబంధు పథకాన్ని పుట్టించాం. విడతల పథకం అమలవుతుంది’’ అని తెలిపారు కేసీఆర్.
బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్లిందని.. ఇక్కడి సదుపాయాలన్నీ ఏ రాష్ట్రంలో కూడా లేవన్నారు సీఎం. తాము తెచ్చినవన్నీ కాంగ్రెస్ వాళ్లు తీసివేస్తామని చెబుతున్నారని.. అందుకే ఆలోచించి ఓటు వేయాలని, ఓడగొట్టుకుంటే తాను ఏమీ చేయలేనని అన్నారు. ఇవన్నీ కూడా వారు చాటుగా చెప్పడం లేదని, ఓపెన్ గానే చెబుతున్నారని.. ధరణి తీసి బంగాళాఖాతంలో వేస్తామని చెబుతున్నారని, అది ఎందుకోసం పెట్టామో అందరూ ఆలోచన చేయాలని, ఈ విషయాలపై చర్చ చేయాలని కోరారు.
బీఆర్ఎస్ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు కేసీఆర్. కంటి వెలుగు పథకాన్ని గతంలో ఎవరైనా ఆలోచించారా..? అని ప్రశ్నించారు. పొరపాటున కాంగ్రెస్ వస్తే కరెంటు పోవడం ఖాయమన్నారు. చరిత్రలో ఎవరూ చేయనన్ని అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను తీసుకొచ్చామని.. ధరణి ఉంటేనే రైతు బంధు, రైతు బీమా వస్తుందని చెప్పారు. తీసేస్తే ఎలా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ దళారుల రాజ్యం వస్తుందని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాతే పెన్షన్లు పెంచామన్నారు. ఎవరు మంచి చేస్తారో.. ఎవరు చెడు చేస్తారో ప్రజలందరూ ఆలోచన చేయాలని పిలుపునిచ్చారు సీఎం.